
ఇక మనకాళ్లు వాటంతటవే నడుస్తాయ్!
లండన్: వచ్చీపోయే వాహనాలతో బిజీ..బిజీగా ఉండే రోడ్డులో మెదడుతో పనిలేకుండా, ఎలాంటి ప్రమాదం జరుగకుండా మన కాళ్లే మనల్ని రోడ్డు దాటిస్తే...రోడ్డులోనో, పార్కులోనో ఎటూ చూడకుండా మనకిష్టమైన పుస్తకాన్ని చదుకుతుంటే మనం చేరాల్సిన చోటుకు మనకాళ్లే మనల్ని చేరిస్తే...కొత్త ప్రదేశాల్లో వెళ్లాల్సిన చోటు గురించి నలుగురిని వాకబు చేయాల్సిన అవసరం లేకుండానే మనకాళ్లే మనల్ని అటువైపు నడిపిస్తే...ఆ థ్రిల్లే వేరు. ఇది కలలో తప్పితే నిజంగా సాధ్యమయ్యేపని కాదు. కాని సాధ్యమని నిరూపించారు జర్మనీలోని హన్నోయర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. మెదడుతో పనిలేకుండా గమ్యానికి మనకాళ్లను తీసుకెళ్లే ‘హ్యూమన్ శాట్‌నావ్’ (మానవ శాటిలైట్ నావిగేషన్) పరికరాన్ని వారు కనుగొన్నారు.
వారు ఇటీవలనే స్వచ్ఛందంగా ముందుకొచ్చిన విద్యార్థులపై ప్రయోగించి దాని పనితీరును ప్రత్యక్షంగా ప్రయోగించి చూపారు. ఈ తరహా పరికరాన్ని వారు సృష్టించడం ఇదే మొదటి సారి. హ్యూమన్ శాట్‌నావ్‌ను మనం నడుముకు అమరుస్తారు. దాని నుంచి ఎలక్ట్రిక్ తరంగాలను తీసుకెళ్లే వైర్లను రెండు కాళ్లకు మోకాలు కింది భాగాన, పైభాగాన తొడపై అమరుస్తారు. సంకోచ, వ్యాకోచాలు కలిగి, మన నడకకు ఉపయోగపడే సార్టోరియస్ కండరాన్ని విద్యుత్ తరంగాలతో ప్రేరిపిస్తారు. అంతే మనకు తెలియకుండానే మనం నడిచేస్తాం. ప్రస్తుతం బ్లూటూత్ ద్వారా పనిచేస్తున్న ఈ పరికరానికి జీపీఎస్ వ్యవస్థను అనుసంధాలించాలని పరిశోధకులు భావిస్తున్నారు. అప్పుడు ముందే ప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా మన గమ్యానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం శాటిశైట్‌తో అనుసంధానించిన నావిగేషన్ యాప్ ద్వారా మనం వెళ్లాల్సిన చోటుకు వెళుతున్నాం గదా! ఇక నావిగేషన్ పరికరాన్ని తరచూ చూడాల్సిన అవసరం లేకుండా అలాంటి వ్యవస్థను మన కాళ్లకు హ్యూమన్ శాటినావ్ ద్వారా తగిలించుకోవడం ఈ కొత్త ప్రయోగం.
ఈ కొత్త పరికరం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అల్జీమర్స్ లాంటి మతిమరుపు జబ్బు ఉన్నవాళ్లుకు ప్రోగ్రామ్ చేసిన హ్యూమన్ శాట్‌నావ్‌ను అమర్చినట్లయితే వారు ఇంటి నుంచి వెళ్లాల్సిన చోటుకెళ్లి మళ్లీ ఇంటికి క్షేమంగా తిరిగొస్తారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో అగ్నిమాపక అధికారులను కూడా ఈ పరికరం సరిగ్గా గైడ్ చేస్తుందట. క్రీడారంగంలో ఈ పరికరం మరింత ఉపయోగపడుతుందని, కోచ్ ప్రోగ్రామ్ చేసి ఈ పరికరాన్ని అథ్లెట్లకు వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయని వారు చెబుతున్నారు. డేటింగ్ యాప్స్ ద్వారా పరిసరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రేమికులు ఎక్కడున్నా ఒకరికొకరు కలుసుకోవచ్చని అంటున్నారు. ఈ పరికరం నుంచి వెలువడే విద్యుత్ తరంగాల వల్ల ప్రతికూల ప్రభావం ఉండదని, కనీసం నొప్పి కూడా కలగదని వారు చెప్పారు. ఈ పరికరాన్ని అమర్చుకొని నడిచిన కొంత మంది విద్యార్థులు మాత్రం తొడ కండరాల వద్ద కొంచెం ‘వేళ్లతో చక్కిలిగింతలు’ పెట్టిన అనుభూతి కలిగిందని తెలిపారు. చూసుకోకుండా నడిస్తే ప్రమాదాలు జరగవా అని ఆ విద్యార్థులు ప్రశ్నించగా, అడ్డుతగిలే వస్తువులను గుర్తించి అందుకు తగినట్లుగా కాళ్ల కండరాలకు సిగ్నల్స్ ఇచ్చే వ్యవస్థ కూడా ఇందులో ఉంటుందని పరిశోధకులు వివరించారు.