
'సొంత చెల్లెళ్లను కాల్చి చంపాడు'
లాహోర్: పాకిస్థాన్లో సొంత సోదరీమణులను కాల్చి చంపాడు ఓ సోదరుడు. వారి ప్రవర్తన మంచిది కాదనే దురాలోచనతోనే అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. పంజాబ్ ప్రావిన్స్లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమర్ హయత్ అనే వ్యక్తి తన చెల్లెళ్లు రజియా, నోరీన్ (20) స్థానికంగా ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్నారనే కోపంతో ఇంటికి వచ్చి తొలుత నిలదీశాడు.
ఈ క్రమంలో వారిమధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో కోపానికి లోనైన ఉమర్ తుపాకీతో వారిద్దరిపై కాల్పులు జరిపాడు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు. తమ చెల్లెళ్ల ప్రవర్తనతో పరువు పోతుందని భావించిన ఉమర్ నిత్యం వారితో గొడవ పడేవాడని, రోజూ కొడుతుండేవాడని చుట్టుపక్కలవారు పోలీసులకు తెలిపారు. గత ఏడాదిలో ఈ ప్రాంతంలో 870మంది మహిళలు పరువు హత్యలకు గురయ్యారు.