ఉడుతలకు జ్ఞాపకశక్తి ఎక్కువే..
ఆహారాన్ని మట్టిలో దాచిపెట్టుకుని.. అవసరమైనప్పుడు వెలికితీసి తినగల సామర్థ్యం ఉడుతలకు సొంతం. అయితే వీటి జ్ఞాపకశక్తి ఇక్కడికే పరిమితం కాలేదని.. సమస్యల పరిష్కారానికి ఉపయోగించిన పద్ధతులను ఇవి రెండేళ్ల వరకూ గుర్తు పెట్టుకోగలవని గుర్తించారు ఎక్స్‌టెక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఐదు ఉడుతలపై నిర్వహించిన ఓ ప్రయోగం ద్వారా ఈ విషయం తెలిసిందని పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ థో రాబర్ట్ తెలిపారు.
ఎరగా ఉంచిన ఆహారాన్ని అందుకునేందుకు కొన్ని అడ్డంకులు సృష్టించిన శాస్త్రవేత్తలు.. ఉడుతలు ఆ అడ్డంకులను ఎలా అధిగమించాయో గమనించారు. మొదట్లో అవి 8 సెకన్ల సమయం తీసుకున్నా.. కొంతకాలం తర్వాత ఈ సమయం 2 సెకన్లకు తగ్గింది. దాదాపు 22 నెలల తర్వాత కొన్ని మార్పులతో ఇదే రకమైన ప్రయోగం చేసినప్పుడు ఆ ఉడుతలు ముందు కొంచెం తటపటాయించినా ఆ తర్వాత మూడు సెకన్ల వ్యవధిలో ఆహారాన్ని అందుకున్నాయని దీని ద్వారా అవి తమ పాత పద్ధతులను గుర్తుంచుకున్నట్లు అయిందని రాబర్ట్ వివరించారు.