సూపర్ కారుకు.. సూపర్ చక్రాలు!
మీరు ఫార్ములా వన్ రేసు చూశారా? గంటకు వందల కిలోమీటర్ల వేగంతో రయ్యిన దూసుకుపోయే కార్లు.. హటాత్తుగా పల్టీలు కొడుతూ ముక్కలు చెక్కలవుతుంటాయి. వేగం మరీ శ్రుతి మించితే ఎంతటి గట్టి చక్రాలైనా ఊడి, ముక్కలైపోక తప్పదు. మరి.. ఫార్ములా వన్ కార్లను మించి.. ఏకంగా ధ్వని కంటే కూడా వేగంగా పరుగెత్తే కారుకు ఇంకెంత పవర్‌ఫుల్ చక్రాలు కావాలి? ఆ సూపర్ చక్రాలు ఇప్పుడు రెడీ అవుతున్నాయి. భూమిమీదే అతివేగవంతమైన చక్రాలుగా ఆటోమొబైల్స్ చరిత్రనే అవి మలుపు తిప్పనున్నాయి!
భూమిపై అతివేగవంతమైన వాహనాన్ని తయారు చేసి రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో బ్లడ్‌హౌండ్ ప్రోగ్రామ్ లిమిటెడ్ కంపెనీ సూపర్‌సోనిక్ కారును రెడీ చేస్తోంది. ధ్వని ఒక సెకనుకు 343.59 మీటర్లు.. అంటే గంటకు 1,236 కి.మీ. ప్రయాణిస్తుంది. అయితే ఆ ధ్వనిని మించిన వేగంతో ప్రయాణించేదే ఈ సూపర్‌సోనిక్ కారు. దక్షిణాఫ్రికాలోని ఓ సరస్సు వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన లేక్ బెడ్‌పై ఇది వచ్చే ఏడాది పరుగులు పెట్టనుంది. మహా వేగంతో దూసుకెళ్లే ఈ కారు కోసం ఇప్పుడు సూపర్ చక్రాలు చకచకా సిద్ధమవుతున్నాయి. రాకెట్‌లా దూసుకెళ్లే ఈ కారు ఎంత దృఢంగా ఉంటుందో, దాని చక్రాలు అంతకన్నా దృఢంగా ఉండాలి. ఆకారం, సైజు, నాణ్యతలో ఏ చిన్న లోపం ఉన్నా అంతే సంగతులు. అందుకే.. అత్యంత నాణ్యత, కచ్చితత్వంతో అల్యూమినియం, జింక్, కాపర్, మాంగనీస్‌ల మిశ్రమంతో వీటిని క్యాజిల్ ఇంజనీరింగ్ (గ్లాస్గో) సంస్థ తయారుచేస్తోంది.
గంటకు 1,610 కిలోమీటర్లు..!
బ్లడ్‌హౌండ్ కారు గరిష్టంగా గంటకు 1,610 కి.మీ. వేగంతో దూసుకెళుతుంది.
రాకెట్లలో ఉపయోగించే యూరో ఫైటర్ జెట్ ఇంజన్‌తో ఈ కారు పరుగులు తీస్తుంది.
కారు చక్రాల డిస్కులు 90 సెం.మీ. సైజు, 91 కిలోల బరువు ఉంటాయి.
చక్రాల డిస్కులు సెకనుకు 170 రౌండ్లు, నిమిషానికి 10,500 రౌండ్లు తిరుగుతాయి. ఫార్ములా వన్ కారుతో పోలిస్తే.. ఈ వేగం 8,000 రౌండ్లు ఎక్కువ!
ముందరి చక్రాలు తాకినప్పుడు ఎగిరిపడే రాయి సైతం బుల్లెట్ వేగంతో దూసుకొస్తుంది. చక్రాల నాణ్యతలో ఏమాత్రం లోపమున్నా కారు పరిస్థితి అంతే.
గరిష్ట వేగంలో గురుత్వాకర్షణ శక్తి కంటే 50 వేల రెట్ల ఎక్కువ ప్రభావం చక్రాలపై పడుతుంది. అంటే.. గంటకు 1200 కి.మీ. వేగంతో తిరుగుతున్న చక్రాలపై ఒక లారీ బరువును మోపినట్లు ఉంటుంది.
ఒక్కో చక్రం విలువ సుమారు రూ. 2.50 కోట్ల పైనే!