స్టాక్‌హోం: లక్షలాది రహస్య పత్రాలను బయటపెట్టి అమెరికా సహా వివిధ దేశాలను వణికించిన వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజేపై అరెస్టు వారంటును రద్దు చేసేందుకు స్వీడన్ సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. తనపై స్వీడన్ జారీ చేసిన అరెస్టు వారంటును తిరస్కరించాలంటూ అసాంజే చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఓ మహిళపై అత్యాచారం, మరో మహిళపై లైంగిక దాడి ఆరోపణలతో నమోదైన కేసుల్లో అసాంజే అరెస్టుకు స్వీడన్ 2010లో వారంటు జారీ చేసింది. అయితే, స్వీడన్‌కు అప్పగింతను తప్పించుకునేందుకుగాను అసాంజే 2012 నుంచీ లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలోనే తలదాచుకుంటున్నారు.
అసాంజేను స్వీడన్‌కు అప్పగించాలన్న డిమాండ్‌ను స్వీడిష్ పోలీసులు పక్కనపెట్టారని, ఆయనను లండన్‌లోనే విచారించేందుకూ వారు సంసిద్ధత వ్యక్తం చేసినందున అరెస్టు వారెంటును రద్దు చేయాల్సిన అవసరం లేదని స్వీడిష్ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.