ప్రతీకాత్మక చిత్రం
శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి టెక్నాలజీ వేదికలు ప్రజల మెదళ్లను హైజాక్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయని ఆయా కంపెనీల్లో తమ కెరీర్ ప్రారంభంలో పనిచేసిన టెక్నోక్రాట్లు వాపోయారు. వీరంతా సెంటర్ ఫర్ హ్యూమన్ టెక్నాలజీ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచం అబ్బురపడే ఉత్పత్తులను ఈ దిగ్గజ టెక్ కంపెనీలు రూపొందించినా క్రమంగా ఇవి మనల్ని వాటికి బానిసలుగా మార్చేశాయని, ఈ కంపెనీలు మన మానసిక ఆరోగ్యాన్ని, సామాజిక సంబంధాలను, ప్రజాస్వామ్యాన్నీ దెబ్బతీస్తున్నాయని సెంటర్ ఫర్ హ్యూమన్ టెక్నాలజీ ఆందోళన వ్యక్తం చేసింది.
టెక్నాలజీ ఫ్లాట్‌ఫాంలపై విపరీత వ్యామోహానికి వ్యతిరేకంగా ‘ది ట్రూత్ అబౌట్ టెక్’ పేరిట కామన్‌సెన్స్ మీడియా సంస్థ సహకారంతో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఈ సంస్థ నిర్ణయించినట్టు ది న్యూయార్స్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇక ఇటీవల దావోస్ సదస్సులో గూగుల్, ఫేస్‌బుక్ వంటి టెక్నాలజీ కంపెనీల ఏకస్వామ్యాన్ని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సొరోస్ ప్రశ్నించారు. వినూత్న ప్రయోగాలకు గూగుల్, ఫేస్‌బుక్ అవరోధంగా ఉన్నాయని, ఇవి సమాజానికి చేటుగా పరిణమించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎలా ఆలోచించాలి, ప్రవర్తించాలనే విషయాలపై వారికి తెలియకుండానే సామాజిక మీడియా సంస్థలు ప్రభావితం చేస్తున్నాయని ఈ సందర్భంగా సొరోస్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment