ప్రతి నలభైమందిలో ఒకరు అంతేనట!
తాళాలు మర్చిపోయి వెళ్లడం, హడావుడిగా మెట్లెక్కి పైకిళ్లి.. అసలు దేనికోసం వెళ్లామో మర్చిపోవడం, మన ఏటీఎమ్ కార్డ్ పిన్ నంబర్ మనకే గుర్తురాకపోవడం.. ఇలాంటివన్నీ మనకి మాత్రమే జరుగుతాయనుకుంటే పొరపాటే. ప్రతి నలభై మందిలో ఒకరు మతిమరుపు బాధితులే. అయితే వారంతా మధ్యవయస్కులో లేక వయసుమళ్లినవారో అయి ఉంటే సహజమేలే అని సరిపుచ్చుకోవచ్చు.. కానీ వారంతా యువసేనే.. ఉడుకు రక్తమే!
ఇరవైల్లో అరవైల లక్షణాలకు కారణం మన అలవాట్లే. మల్టీటాస్కింగ్ అని ఫీలవుతూ మనం చేస్తున్న కొన్నిపనులే మనల్ని 'భలే భలే మగాడివోయ్' సినిమాలో హీరోకి సోదర సోదరీమణులను చేస్తుంది. అరే.. మన మల్టీటాస్కింగ్ ఏంటో కూడా మర్చిపోయారా! అదేనండీ.. టీవీ చూస్తూ ఫోన్ లో చాటింగ్ చేయడం, కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ ఫోన్లో మాట్లాడ్డం, ఫోన్ ను..టీవీను..కంప్యూటర్ను ఏకకాలంలో దడదడలాడించడం మన యూత్కి మాత్రమే తెలిసిన విద్య కదా. ఇప్పుడదే మన మెదడు పనితీరుని మందగించేలా చేస్తుందని జీర్ణించుకోవడం కాస్త కష్టమైన విషయమే.
మనిషి మెదడు పని తీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసుతోపాటు మారుతూ ఉంటుంది. అయితే మెదడు బాగా చురుగ్గా పనిచేసేది మాత్రం యవ్వనంలోనే. 20-25 మధ్య వయసులో ఉన్న యువతరానికి దేన్నైనా ఇట్టే గ్రహించే శక్తి, గ్రహించినదాన్ని జ్ఞాపకముంచుకునే శక్తి ఎక్కువ. కానీ ఇప్పుడదంతా ఒకప్పటిమాట. మన తండ్రులు,తాతలు యువకులుగా ఉన్నప్పటిమాట. జ్ఞాపకశక్తితో సహా ఇప్పుడంతా ఇన్స్టంటే!
ప్రతి చిన్న విషయానికి టెక్నాలజీ మీద ఆధారపడే ఈ రోజుల్లో.. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్.. ఇంకా ఇతర గ్యాడ్జెట్లు ఒకేసారి వినియోగించడం వల్లే అసలు సమస్య మొదలౌతుంది. కాలిఫోర్నియాలోని ఓ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. ఒకేసారి ఇన్ని పనుల భారం మొదడు మీద పడడం, దేనిమీదా మనకి సరైన ఏకాగ్రత లేకపోవడంతో మొత్తానికి అది అన్నీ మర్చిపోయేలా మనమే చేస్తున్నాం అనేది సారాంశం. ఒకే సమయంలో రకరకాల పనుల మీద ధ్యాసపెట్టడం వల్ల మన మెదడులో కొత్త జ్ఞాపకాలను భద్రపరచుకునే భాగం నిరుపయోగం అవుతుంది. మొదడు సంపూర్ణంగా దేన్నీ గుర్తుంచుకోలేకపోతుంది. ఫలితంగా యవ్వనంలోనే జ్ఞాపకశక్తి విషయంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.