విద్యార్థి గురకపెడుతున్నాడని..
బీజింగ్: పక్కవారు గురకపెడుతుంటే నిద్రపట్టడం కొంచెం కష్టమే. గురక ఆపించడానికి గురకపెట్టేవారిని కొంచెం కదిలించడం లాంటి పనులు చేస్తుంటారు. అయితే చైనాలో మాత్రం ఓ విద్యార్థి గురకపెడుతున్నాడన్న కారణంతో తోటి విద్యార్థులు చావబాదారు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో పాటు వినికిడి సమస్యను కూడా ఎదుర్కొంటున్నాడు సదరు విద్యార్థి.
వివరాల్లోకి వెళ్తే.. షాంగ్జీ ప్రావిన్సులోని మిడిల్ స్కూల్లో గ్రేడ్ వన్ చదువుతున్న మా గురుయ్(15)కి నిద్రలో గురకపెట్టే అలవాటు. అతడి రూమ్మేట్స్ 12 మందికి ఇది నచ్చకపోవటంతో చాలా సార్లు గురుయ్ను గురకపెట్టొద్దని హెచ్చరించారు. అయితే ఇటీవల గురుయ్ నిద్రపోతున్న సమయంలో మళ్లీ గురకపెట్టడంతో ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు గురుయ్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తలకు తీవ్రగాయం కావటంతో ఆసుపత్రికి తరలించగా.. గురుయ్ పుర్రెలో పెద్ద పగులు రావడంతో పాటు వినికిడి సమస్యను కూడా ఎదుర్కొంటున్నాడని వైద్యులు తేల్చారు.
దీనిపై గురుయ్ తండ్రి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అకారణంగా తన కుమారుడిపై దాడి చేశారని వాపోయాడు. చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు కూడా స్కూల్ యాజమాన్యం నిరాకరించిందని తెలిపాడు. స్కూల్ యాజమాన్యం, దాడికి పాల్పడిన తోటి విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.