
ఆత్మకూరు (ఎం)/హైదరాబాద్ : అమెరికాలో ఉన్మాదుల దుశ్చర్యకు మరో తెలుగువాడు బలయ్యాడు. జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లి.. స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న కొత్త గోవర్ధన్ రెడ్డి (45)పై మంగళవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) 8 గంటలకు స్టోర్‌లో ఓ నల్లజాతీయుడు విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలలో గోవర్ధన్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆయన.. సెలవులపై మార్చిలో ఇంటికొస్తానని కుటుంబసభ్యులు, మిత్రులకు చెప్పారు. అంతలోనే గోవర్ధన్ మృతిచెందారన్న వార్త ఆయన సొంతూరు.. యాదాద్రి భువనగరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం రహీంఖాన్‌పేటలో, హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో విషాదం నెలకొంది. ఫ్లోరిడా రాష్ట్రంలోని పెన్సకోలా సిటీలో నివాసం ఉంటున్న గోవర్ధన్.. ఫ్లోరిడాలోని ఓ గ్యాస్‌స్టేషన్‌లోని స్టోర్‌లో కౌంటర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం గోవర్ధన్‌రెడ్డి స్టోర్‌లో ఉండగా ముగ్గురు నల్లజాతీయులు (ఓ మహిళతోసహా) లోపలకు ప్రవేశించి దోపిడీకి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనే గోవర్ధన్‌పై మూడురౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం.. దోపిడీకి కాల్పులకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి హత్యానేరం కిందకేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆయనకు భార్య శోభారాణి, ఇద్దరు కుమార్తెలు (శ్రియ, తులసి) ఉన్నారు. భార్య బోడుప్పల్‌లో నివాసముంటూ.. ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. పెద్ద కుమార్తె శ్రియ ఇంజనీరింగ్, చిన్న కుమార్తె తులసి ఇంటర్ చదువుతున్నారు. ఆయన తండ్రి నర్సిరెడ్డి, తల్లి పద్మ స్వగ్రామమైన రహీంఖాన్‌పేటలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. కుమారుడు మృతిచెందిన వార్త అర్ధరాత్రి వరకు తల్లిదండ్రులకు తెలియలేదు. నర్సిరెడ్డి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయనకు ఈ విషయం చెప్పలేదు. ఈ దుర్వార్తను టీవీల్లో చూసిన గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.
గోవర్ధన్‌కు తుపాకీ గురిపెడుతున్న దుండగుడు
చిన్న అవకాశంతో..
డిగ్రీ వరకు చదువుకున్న గోవర్ధన్.. హైదరాబాద్‌లోని ఘటి కార్గో కంపెనీలో పనిచేసేవాడు. అమెరికాలో ఉంటున్న బంధువుల ద్వారా లభించిన అవకాశంతో అతనూ అక్కడికి వెళ్లాడు. అక్కడే డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో మేనేజర్‌గా ఉద్యోగం లభించింది. ఇతనికి ముగ్గురు చెల్లెళ్లు కాగా, మూడో సోదరి భర్తను కూడా ఈయనే అమెరికా తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆయన కూడా అక్కడే ఉన్నారు. గోవర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. 15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆయన మధ్యలో 2సార్లు స్వదేశానికి వచ్చి వెళ్లారు. 2009లో రహీంఖాన్‌పేట గ్రామాభివృద్ధికి ఓ సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఐదేళ్ల క్రితం మరోసారి వచ్చారు. హైదరాబాద్‌లోని సెటిల్ అవుదామని నిర్ణయించుకుని ఆన్‌లైన్‌లో బంగారం వ్యాపారం ప్రారంభించాడు. ఈ వ్యాపారం కలిసిరాకపోవడంతో తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. ఇటీవల భువనగిరిలో ఉండే ఓ స్నేహితుడికి ఫోన్ చేసి మార్చిలో వస్తున్నట్లు చెప్పాడు.
కుటుంబసభ్యులతో గోవర్ధన్‌రెడ్డి(ఫైల్)
ఫ్రెండ్స్ కాలనీలో విషాదఛాయలు
ఉప్పల్‌లోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన గోవర్ధన్‌రెడ్డి భార్య, పిల్లలు ఉంటున్నారు. ఆయన భార్య శోభారాణి, ఇద్దరు పిల్లలు ఎనిమిదేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఆయన మరణవార్తతో భార్య, పిల్లలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరో రెండు నెలల్లో గోవర్ధన్ అగ్రిమెంట్ పూర్తవనుండగా.. త్వరలోనే భారత్‌కు రావాలని నిర్ణయించుకున్నారు. మృతదేహన్ని ఇక్కడికి తెప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు
Comments
Please login to add a commentAdd a comment