ప్రతీకారంతోనే దాడులు చేశామని నెత్తుటితో రాశారు!
కాబూల్: అఫ్జల్ గురు మృతికి ప్రతీకారంగానే అఫ్గనిస్థాన్ మజర్ ఇ షరీఫ్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేశామంటూ ఉగ్రవాదులు నెత్తుటితో రాసిన రాతలు తాజాగా వెలుగుచూశాయి. 'అఫ్జల్ గురు తరఫున ప్రతీకారంగానే' (అఫ్జల్ గురుకా ఇంతెకామ్), 'ఒక అమరుడు, వేలమంది ఆత్మాహుతి బాంబర్లు' (ఏక్ షహీద్, హజార్ ఫిదాయి) అంటూ భారత కాన్సులేట్ గోడలపై ఉగ్రవాదులు నెత్తుటితో రాశారు.
ఉత్తర అఫ్గన్ నగరమైన మజర్ ఇ షరీఫ్‌లోని భారత కాన్సులేట్‌పై ఉగ్రవాదులు ఆదివారం దాడి చేసేందుకు ప్రయత్నించారు. కాన్సులేట్ ప్రాంగణంలోకి చొరబడే క్రమంలో బాంబులు పేల్చారు. వీరి దాడిని అఫ్గన్ భద్రతా దళాలు తిప్పికొట్టాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు తూర్పు అఫ్గన్ నగరమైన జలలాబాద్లోని భారత కాన్సులేట్ వద్ద మంగళవారం చిన్నపాటి పేలుడు సంభవించింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో అఫ్గన్‌లో ఈ ఘటనలు జరుగడం గమనార్హం. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడులకు దిగిన ఉగ్రవాదులు కూడా తాము అఫ్జల్‌గురు ఉరికి ప్రతీకారం తీర్చుకుంటున్నామని చెప్పినట్టు తెలుస్తోంది. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురు 2013 ఫిబ్రవరి 9న ఉరితీసిన సంగతి తెలిసిందే.