340 కోట్ల ఏళ్ల కింద తొలి సునామీ
కొన్ని కోట్ల సంవత్సరాల కింద అంగారకుడిని రెండు భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల దానిపై రెండు సునామీలు సంభవించాయని తాజా పరిశోధనలో తేలింది. దాదాపు 340 కోట్ల సంవత్సరాల కింద భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల తొలిసారి సునామీ అల ఏర్పడిందని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుడు అల్బర్టో ఫెయిరెన్ తెలిపారు. ద్రవరూపంలోని నీరు వల్లే ఈ అల ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే మరో భారీ ఉల్కా విస్ఫోటం వల్ల రెండో సునామీ చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు ఆధారాలను కనుగొన్నారు.
ఈ రెండు సునామీలకు మధ్య ఉన్న లక్షల సంవత్సరాల కాలం పాటు అంగారకుడు అతి శీతల స్థితిలోకి వెళ్లిపోయాడని గుర్తించారు. ఆ సమయంలోనే అక్కడి నీరు ఘనీభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా అక్కడి సముద్రతీరం ప్రాంతంలోని నీరు చాలా వెనక్కి వెళ్లడం ద్వారా రెండో సముద్రతీరం ఏర్పడిందని భావిస్తున్నారు. రెండో సునామీ సంభవించిన సమయంలో సముద్రంలోని మంచు ఎగిరి చాలా దూరంలో పడిపోయిందని, ఇది తిరిగి సముద్రంలోకి రాలేదని ఫెయిరెన్ పేర్కొన్నారు. అంగారకుడు ఏర్పడిన తొలినాళ్లలో చాలా చల్లటి సముద్రాలు ఉండేవని స్పష్టం చేశారు.