
ఇద్దరు వైద్యుల మిస్టీరియస్ మరణాలు!
ఉత్తర కొరియా నుంచి వచ్చే వార్తలను ఒక పట్టాన నమ్మడానికి కుదరదు. 1953 నుంచి ఈ దేశం ఒక గాలి బుడగ మాదిరిగా తనలో తాను ఉంటూ బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంచుకుంది. అయినా, ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ఎన్నో వార్తలు, ఊహాగానాలు ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఉత్తర కొరియాకు చెందిన ఇద్దరు వైద్యుల మిస్టీరియస్ మరణం గురించే కూడా కథనాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి.
కాంబోడియాలోని నామ్ పెన్ లో ఇద్దరు వైద్యులు అనుమానాస్పదంగా మృతి చెందారు. శనివారం రాత్రి వారు క్లినిక్ లో బాగా మద్యం సేవించి.. భోజనం చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వారి పరిస్థితి విషమంగా కనిపించడంతో వృత్తిరీత్య వైద్యులైన వారి భార్యలు వారికి ఇంజెక్షన్ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. వారు గుండెపోటుతో మృతిచెందారు. మృతిచెందిన వారిని డాక్టర్ ఆన్ హ్యోంగ్ చాన్ (56), డాక్టర్ రిమున్ చోల్ (50) గా గుర్తించారు. వీరి మృతి ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు శనివారం రాత్రి గుండెపోటుతో చనిపోతే.. వారి భార్యలు తెల్లారే వరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. వారి మరణాలు గురించే తెలుసుకునేందుకు క్లినిక్ కు వెళ్లిన విలేకరులను నలుగురు ఉత్తర కొరియన్ వైద్యులు బయటకు గెంటేశారు. ఉత్తర కొరియాకు చెందిన దాదాపు 50వేల మంది విదేశాల్లో పనిచేస్తూ తమ అధినేత కింగ్ జాంగ్ కు అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విదేశాల్లో ఉత్తర కొరియా వైద్యుల మరణాల గురించి వార్తలు తరచూగా వినిపిస్తున్నాయి. ఈ కథనాల్లోనూ వాస్తవాస్తవాలు ఎంతనేది సరిగ్గా నిర్ధారించడానికి లేదు.
నిజానికి ఉత్తర కొరియా నుంచి బయటి ప్రపంచానికి అందే వార్తలు చాలా వికృతంగా ఉంటాయని అపవాదు ఉంది. చాలా సందర్భాల్లో ఆ దేశానికి సంబంధించిన సంచలనాలు, వికృత కథనాలు, అసత్య ప్రచారాలు వెలుగులోకి వస్తుంటాయి. ఇందులో ఎక్కువశాతం దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ చుట్టే తిరుగుతాయి. తుమ్మినందుకు ప్యాంగ్యాంగ్లో ఓ ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్ ను కిమ్ ఉరితీశారని, ఆయన 2012లో 'సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్'గా నిలిచారని, పోర్న్ సినిమాలో నటించినందుకు తన ప్రియురాలు, పాప్ సింగర్ హ్యోన్ సాంగ్ వోల్ ను హత్య చేయించారని, తన అత్త కిమ్ క్యోంగ్ హుయిని విషం పెట్టి చంపేశారని, రగులుతున్న అగ్నిపర్వతాన్ని కిమ్ స్వయంగా ఎక్కారని ఇలా ఎన్నో వార్తలు ఇప్పటివరకు చక్కర్లు కొట్టాయి.