శరణార్థుల సమస్య తీవ్రం..
- ముదిరిన రోహింగ్యాల సంక్షోభం...
- నగరంలోనూ దాదాపు 3,800 మంది రోహింగ్యాలు..
రోహింగ్యా శరణార్థుల సమస్య తీవ్రరూపం దాల్చింది. మయన్మార్ (బర్మా)లో అల్పసంఖ్యాక ముస్లిం తెగకు చెందిన వీరిపై హత్యాకాండ, దాడులు సాగుతుండటంతో బంగ్లాదేశ్ తదితర పొరుగు దేశాలకు పెద్ద ఎత్తున వలసలు పోటెత్తుతున్నాయి. గత నెల 25న మయన్మార్ సైనికస్థావరంతో పాటు, పోలీస్ ఔట్‌పోస్టులపై ‘ఆరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ’ మిలిటెంట్ గ్రూపు దాడి ఘటనలో 12 మంది సైనికులతో పాటు 59 మంది రోహింగ్యా తిరుగుబాటుదారులు మరణించారు. ఆ తర్వాత జరిగిన దాడులు, సైనికచర్యల్లో 400 మంది వరకు ఈ తెగవారు హతం కాగా మళ్లీ మూకుమ్మడి వలసల్లో భాగంగా రెండులక్షలకు పైగా శరణార్థులు బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు.
మారుమూల సెయింట్ మార్టిన్ దీవిలో తలదాచుకున్న రెండువేల మంది రోహింగ్యాలను బంగ్లాదేశ్ అధికారులు బలవంతంగా తిరిగి వారి దేశానికి పంపించారు. మయన్మార్‌లో గత పదిరోజుల్లో చోటు చేసుకున్న హింస కారణంగా 1,23,600 మంది శరణార్ధులు బంగ్లాదేశ్‌లోకి వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి వాలంటీర్లు వెల్లడించారు. తాజా సంక్షోభానికి పూర్వమే దాదాపు నాలుగు లక్షల మంది బంగ్లాదేశ్‌లోకి రావడంతో ఇక శరణార్థులను అనుమతించేది లేదంటూ ఆ దేశం స్పష్టంచేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో పాటు మలేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, భారత్‌లలో రోహింగ్యాలు తలదాచుకుంటున్నారు. మనదేశంలో నలభై నుంచి యాభై వేల మంది రోహింగ్యా శరణార్దులున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఎవరీ రోహింగ్యాలు...?
బౌద్ధ మతస్తులు మెజారిటీగా (5 కోట్ల జనాభా) ఉన్న మయన్మార్‌లో దాదాపు 12 లక్షల జనాభాతో బెంగాలీ మాండలికం మాట్లాడే రోహింగ్యాలు ప్రధానంగా రఖైన్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఆ దేశంలో అధికారికంగా గుర్తించిన 135 జాతుల్లో లేకపోవడంతో వారికి పౌరసత్వం లభించడంలేదు. కనీసం గుర్తింపుకార్డులు ఇవ్వకపోగా, ఏ హక్కులూ కల్పించలేదు. పౌరులుగా గుర్తింపు పొందాలంటే 60 ఏళ్ల పాటు ఆ దేశంలో ఉన్నట్లుగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. రోహింగ్యాలను అక్రమ బంగ్లాదేశీ వలసదారులుగానే అక్కడి అధికారులు పరిగణిస్తుంటారు. పాలకుల విధానాలు కూడా వీరికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి.
ప్రభుత్వ ప్రేరేపిత హింస కారణంగా 1942లో బర్మా జాతీయుల చేతుల్లో దాదాపు లక్ష మంది వరకు రోహింగ్యాలు హత్యకు గురయ్యారు. 1978లో డ్రాగన్‌కింగ్ పేరిట చేపట్టిన సైనిక చర్యలో అనేక అకృత్యాలు చోటుచేసుకున్నాయి. దాదాపు మూడులక్షల మంది బంగ్లాదేశ్‌కు పారిపోగా, వారికి ఆహారపదార్ధాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించడంతో చాలా మంది మృత్యువు బారినపడ్డారు. మళ్లీ 1991లో రోహింగ్యాలపై బర్మా ఆర్మీ దాడులకు దిగడంతో 2.68 లక్షల మంది బంగ్లాదేశ్ చేరుకోగా వారిలో 60 శాతం మందిని ఆ దేశం తిప్పి పంపించింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సాగిన మిలటరీ పాలనలో సైన్యంతో పాటు, మెజారిటీ వర్గాల దాడులు కొనసాగి మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయి. మళ్లీ 2012 అక్టోబర్‌లో హింసాత్మక ఘటనల తర్వాత పెద్ద సంఖ్యలో వలసలు చోటుచేసుకున్నాయి. సాక్షి నాలెడ్జ్ సెంటర్
భారత్‌లో..
దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులతో పాటు, 40 వేల మంది రోహింగ్యా శరణార్థులనుతిప్పి పంపించనున్నట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజూ ప్రకటించారు. వీరి వివరాలను సేకరించాల్సిందిగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. పొరుగుదేశాల శరణార్దులను ఆదుకున్న సుదీర్ఘచరిత్ర భారత్‌కు ఉన్నందున, వీరిని బలవంతంగా మయన్మార్‌కు పంపించవద్దని హ్యుమన్ రైట్స్ వాచ్ సంస్థ కోరింది. భారత్‌లో ప్రధానంగా జమ్మూ కశ్మీర్, తెలంగాణ, హరియాణా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్‌లో రోహింగ్యాలు ఉంటున్నారు.
వీరిలో దాదాపు 3,800 మంది హైదరాబాద్‌లోని బాలాపూర్, పాతబస్తీలోని 16 సెటిల్‌మెంట్లలో నివసిస్తున్నారు. ఇక్కడి లేబర్ అడ్డాల్లో కూలీలుగా, చెత్త ఏరుకునే వారుగా, చిరువ్యాపారులుగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. వీరి దుస్థితి పట్ల ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సానుభూతిని వ్యక్తం చేయడంతో ఈ ఉగ్రవాద గ్రూపు వైపు ఈ వర్గం వారు ఆకర్షితులవుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.