
ఓ పెళ్లి కూతురి సాహసం
మరికాసేపట్లో వరుడి చేయి అందుకోవాల్సిన ఓ అందమైన యువతి... మరో వ్యక్తి ప్రాణాలను రక్షించడానికి వేగంగా ముందుకు కదిలింది. చైనాకు చెందిన గూ యాన్ యాన్.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. దీంతో ఆమె ఇపుడు "అత్యంత అందమైన పెళ్లికూతురి' గా సోషల్ మీడియాలో ప్రశంసలందుకుంటోంది. ఇంత సమయస్ఫూర్తిగా వ్యవహరించిన యాన్ స్థానిక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే యాన్ పెళ్లికూతురు దుస్తుల్లో అందంగా మెరిసిపోతోంది. అంతే అందంగా మురిసిపోతూ సముద్రతీరంలో ఫొటోలకు పోజులిస్తోంది. ఉన్నట్లుండి ఆమెకు.. సముద్రంలో మునిగిపోతున్న ఓ వ్యక్తి కనిపించాడు. స్విమ్మింగ్ చేస్తున్న అతనికి గుండెపోటు రావడంతో అచేతనంగా మారిపోవడాన్ని ఆమె గమనించింది. అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడకు చేరుకుని నిమిషాల మీద అతన్ని ఒడ్డుకు చేర్చింది. కానీ అప్పటికే గుండె స్పందన ఆగిపోయింది. వెంటనే ఆమె సీపీఆర్ థెరపీ (గుండెకు కృత్రిమంగా స్పందనలు అందించే ప్రక్రియ) ప్రారంభించింది. కానీ అంత ప్రయత్నించినా అతడి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయింది. దీనికి సంబంధించి స్థానిక మీడియా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో గూ యాన్ యాన్ పొగడ్తలతో ముంచెత్తేశారు. అందమైన పెళ్లికూతురంటూ వారి భాషలో కొనియాడారు.
అంతేనా....స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఆమెను పెళ్లి చేసుకోబోతున్న వరుడు లీ చాంగ్ కూడా తన ఫియాన్సీ సాహసానికి మురిసిపోయాడట. ''నాకు చాలా గర్వంగా ఉంది... నా కంటే వేగంగా పరిగెత్తి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది'' అంటూ మురిసిపోయాడట అతగాడు.