వాషింగ్టన్ : ఊతా సరస్సులో చేపల జనాభాను పునరుద్ధరించేందుకు వినూత్న ఆలోచన చేసిన ‘ఊతా డివిజన్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ రీసోర్సెస్’ (డీడబ్ల్యూఆర్) విమర్శల పాలైంది. సోషల్ మీడియాలో తాము పోస్ట్ చేసిన వీడియోపై వివరణ ఇచ్చుకుంది. అసలేం జరిగిందంటే... అమెరికాలోని ఊతా రాష్ట్రంలో ఉన్న ఊతా సరస్సును సందర్శించేందుకు ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తూంటారు. అక్కడ ఫిషింగ్ చేసే వెసలుబాటు కూడా ఉంటుంది. దీంతో చేపల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుండటంతో.. డీడబ్ల్యూఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేప పిల్లలను నీళ్లలోకి వదిలేందుకు.. మొదట్లో గుర్రాలను ఉపయోగించేవారు. గుర్రాలపై చేపలను రవాణా చేసేవారు. అయితే ఊతా సరస్సు ఎత్తైన కొండల మధ్య ఉండటంతో ఈ ప్రక్రియ చాలా కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో విమానం ద్వారా చేప పిల్లలను నీళ్లలోకి వదలాలని నిర్ణయించిన డీడబ్ల్యూఆర్ తమ ఆలోచనను అమలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోను చూసిన జంతు ప్రేమికులు డీడబ్ల్యూఆర్‌ను తప్పుపట్టారు. చేప పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించారంటూ విమర్శించారు.
వాటికేం కాదు..
తమ చర్యను సమర్థించుకున్న డీడబ్ల్యూఆర్.. మేము ఎన్నోసార్లు గాల్లోంచి సరస్సులోకి చేప పిల్లలను వదిలాం.. చాలా చిన్నవైన పిల్లలు 1 నుంచి 3 ఇంచుల పొడవు గలవి. వాటిని విమానం నుంచి విసరటం వల్ల ఎటువంటి అపాయం జరగదంటూ వివరణ ఇచ్చింది. నయాగరా జలపాతంతో పాటుగా జాలువారే చేపలు బతికే ఉంటున్నాయి కదా అంటూ తమ చర్యను సమర్థించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment