
లాస్‌ఏంజిలస్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ సైనిక చికిత్సాలయంలోకి చొరబడిన దుండగుడు ముగ్గురు మహిళలను తుపాకీతో కాల్చి చంపి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. దుండగుడు మాజీ సైనికుడని సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం నాపా వ్యాలీలో ఉన్న ‘వెటరన్స్ హోమ్ ఆఫ్ కాలిఫోర్నియా’ చికిత్సాలయంలోకి ప్రవేశించిన దుండగుడు అక్కడి ఏడుగురు మహిళలను బందీలుగా చేసుకున్నాడు. తర్వాత నలుగురిని వదిలేశాడు.
సాయంత్రం భద్రతా దళాలు అతను దాక్కొన్న గదిలోకి వెళ్లగా ముగ్గురు మహిళల, అతని మృతదేహాలున్నాయి. వారిని తుపాకీతో కాల్చి తర్వాత అతనూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. అతను అదే చికిత్సాలయంలో మానసిక రుగ్మతలకు చికిత్స చేయించుకునేవాడని స్థానిక పత్రిక పేర్కొంది. కాగా, అనూహ్య దాడులను ఎదుర్కొనేందుకు ఫ్లోరిడాలోని పాఠశాలల్లో శిక్షణ పొందిన సిబ్బందికి ఆయుధాలు ఇవ్వడానికి సంబంధించిన బిల్లును చట్టంగా మార్చారు. తుపాకులు కొనడానికి కనీస అర్హత వయసును 18 నుంచి 21 పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment