ఒరెగాన్‌లో షెరిడాన్ ఫెడరల్ జైలులో చిన్నారులు
పసిపిల్లల ఆక్రందనల్ని కూడా పట్టించుకోకుండా అమెరికాలో ట్రంప్ సర్కార్ కఠినంగా అమలు చేస్తున్న వలస విధానానికి భారతీయులూ బలైపోతున్నారు. కేవలం ఒక్క నెలలోనే 50 మందికి పైగా భారతీయులను అదుపులోనికి తీసుకొని ఒరెగాన్‌లో షెరిడాన్ ఫెడరల్ జైలుకి తరలించినట్టు స్థానిక పత్రిక ది ఒరెగోనియన్ ఒక కథనంలో వెల్లడించింది. కొంత మంది భారతీయుల పిల్లల్ని కూడా తల్లిదండ్రుల నుంచి వేరు చేసినట్టు కూడా తెలుస్తోంది. గతనెలలో 123 మంది దక్షిణాసియా నుంచి ఆశ్రయం కోరి వస్తే, వారిని నిర్బంధించి జైలుకి తరలించారు.
వారిలో 52 మంది భారతీయులని వారంతా పంజాబీ, హిందీ మాట్లాడుతున్నారని , మిగిలిన వారు చైనా, మెక్సికో, నేపాల్, పాకిస్థాన్, ఉక్రెయిన్ తదితర దేశాల నుంచి వచ్చారని ఆ కథనం పేర్కొంది. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల బృందం ఈ జైళ్లను సందర్శించినప్పుడు అక్రమ వలసల పేరుతో భారతీయుల్ని కూడా నిర్బంధిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. శరణార్థులందరినీ ఏకాకిలను చేసి, ఎవరితోనూ మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు. కనీసం లాయర్‌ని సంప్రదించే అవకాశం కూడా వారికి ఉండడం లేదు. అలా నిర్బంధించిన భారతీయుల్లో సిక్కులు, క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నారు.
భారత్‌లో మతపరమైన వేధింపులు తట్టుకోలేక తాము దేశం విడిచి వచ్చినట్టు వారు చెబుతున్నారు. ‘ రోజుకి 22 నుంచి 23 గంటల పాటు నాలుగ్గోడల మధ్యే ఉంచుతున్నారు. ఒక సెల్‌లో ముగ్గురేసి చొప్పున ఉన్నాము. భార్యలు ఎక్కడున్నారో తెలీదు. పిల్లల్ని ఏం చేశారో ఆందోళనగా ఉంది. కనీసం లాయర్‌తో మాట్లాడే అవకాశం కూడా మాకు ఇవ్వడం లేదు. ఏం చేయాలో తెలీక బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాం‘ అంటూ వారంతా డెమొక్రాటిక్ పార్టీ నేతలతో మొర పెట్టుకున్నారు.
7 వేలకు పైగా భారతీయుల దరఖాస్తులు : యూఎన్
అమెరికాని ఆశ్రయం కోరి వస్తున్న వారి సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. 2017లో 7 వేలకు మందికి పైగా భారతీయులు అమెరికాలో ఆశ్రయం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నట్టుగా ఐక్యరాజ్య సమితికి చెందిన శరణార్థి సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2017 చివరినాటికి 6.85 కోట్ల మంది నిరాశ్రయులుగా మారారని, వారిలో కేవలం గత ఏడాది 1.62 కోట్ల మంది నిరాశ్రయులు ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది.
ప్రతీ రోజూ సగటున 44 వేల 500 మంది నిరాశ్రయులుగా మారుతున్నట్టు యూఎన్ అంచనా వేసింది. యుద్ధాలు, హింసాత్మక ఘటనలు, రాజకీయ అనిశ్చితి కారణంగా నిరాశ్రయులవుతున్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. కాంగో సంక్షోభం, దక్షిణ సూడాన్ యుద్ధం, మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు ఇలా వివిధ దేశాల నుంచి వలసలు ఇటీవల కాలంలో పెరిగిపోవడంతో గత ఏడాది అత్యధికంగా 49,500 మంది అమెరికాకు శరణార్థులుగా వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నారు. వెనిజులా నుంచి 63 శాతం వరకు శరణార్థుల సంఖ్య పెరిగిపోవడం చూస్తే ఆ దేశంలో ఎంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతోంది.
మెక్సికో నుంచి 26,100, చైనా (17,400), హైతి (8,600), భారత్ (7,400) మంది పొట్ట చేత పట్టుకొని దేశం విడిచి వెళ్లిపోవడానికి సిద్ధమైనట్టు ఆ నివేదిక వెల్లడించింది. 2017 చివరి నాటికి భారత్‌లో లక్షా 97వేల 146 మంది దేశం విడిచి వెళ్లడానికి సిద్ధమయ్యారు. వీరిలో 10,519 మంది శరణార్థుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక 2013 సంవత్సరం నుంచి సిరియా నుంచి అత్యధికంగా వలస వెళ్లిపోతున్నారని ఆ నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment