రష్యాకు టర్కీ సమన్లు
అంకారా: టర్కీ మరోసారి రష్యా జోలికెళ్లింది. ఆ దేశానికి సమన్లు పంపించింది. తమ దేశ గగనతలంపై అనుమతి లేకుండా రష్యా విమానాలు వెళ్లాయని పేర్కొంటూ వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించింది. ఈ మేరకు టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
'టర్కీ వైమానిక అధికారులు పలుమార్లు రష్యా యుద్ధ విమానం సు-34కు హెచ్చరికలు జారీ చేశారు. మా గగన తలంలోకి రావొద్దని రష్యా భాషలో, ఆంగ్లంలో చెప్పారు. అయినా వినలేదు. ఇలా జరగడం ఇప్పటికి చాలాసార్లు. అందుకే మేం సమన్లు పంపించాం. నాటో కూడా పంపించింది' అని టర్కీ అధికారులు తెలిపారు. రష్యాపై ఎంతోనమ్మకంతో మేం ఇప్పటి వరకు ఎలాంటి వివాదానికి దిగదలుచుకోలేదని కూడా మరోమాటగా చెప్పారు. గతంలో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చినప్పటి నుంచి రష్యాకు టర్కీకి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.