‘నిళంగ చాలా స్మార్ట్. ప్రతిభావంతురాలు. నిజానికి ఈ లక్షణాలు కలిగి ఉండటం కంటే కూడా వాళ్ల అమ్మ శాంతా మయదున్నె కారణంగానే కాలేజీలో తను పాపులర్ అయింది. వాళ్లిద్దరు ఇకలేరనే విషయం తెలియగానే షాక్ గురయ్యాను. నిళంగా నీకు.. మీ అమ్మ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అంటూ శ్రీలంక బాంబు పేలుళ్లలో మరణించిన తన స్నేహితురాలికి రాధా అనే యువతి నివాళులు అర్పించారు. ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లలోని విదేశీయులే లక్ష్యంగా బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా షాంగ్రీ లా హోటల్‌లో సంభవించిన పేలుళ్లలో శ్రీలంక టీవీ సెలబ్రిటీ చెఫ్ శాంతా మయదున్నెతో పాటు, ఆమె కూతురు కూడా మృత్యువాత పడ్డారు. మరణించడానికి కొన్ని నిమిషాల ముందు కూతురుతో కలిసి ఆమె తీసుకున్న సెల్ఫీ చూసి వారి బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్నేహితుల్లా మెలిగే తల్లీకూతుళ్లు మరణంలోనూ అనుబంధాన్ని కొనసాగించారంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.
కాగా శ్రీలంకలో లైవ్ టెలివిజన్ కుకింగ్ షో నిర్వహించిన మొదటి మహిళగా శాంత మయదున్నె నిలిచారు. తమ అభిమాన సెలబ్రిటీ దుర్మరణం పట్ల పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇక ఆదివారం జరిగిన శ్రీలంక వరుస పేలుళ్లలో మృతులు సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎనిమిది చోట్ల జరిగిన ఈ బాంబు పేలుళ్లలో 290 మంది మరణించగా, 450 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో భారతదేశానికి చెందిన పలువురు మహిళలు, జేడీఎస్ నాయకులు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment