టర్కీలో టెర్రర్ హర్రర్!
ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదులు మరోసారి అలజడి సృష్టించారు. ఇద్దరు మహిళా మిలిటెంట్లు టర్కీ పోలీసుల బస్సుపై తుపాకీ కాల్పులు, గ్రనేడ్ దాడులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడగా.. సత్వరమే స్పందించిన పోలీసులు ఆ ఇద్దరు మహిళా సాయుధులను సంఘటనా స్థలంలోనే కాల్చిచంపేశారు.
ఇస్తాంబుల్‌లోని బేరాంపాస జిల్లాలోని పోలీసు స్టేషన్ లక్ష్యంగా మహిళా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పోలీసు స్టేషన్‌లోకి పోలీసుల బస్సు వెళుతుండగా ఒక మహిళ కాల్పులు జరుపగా, మరొక మహిళ గ్రనేడ్లు విసిరింది. సంఘటనా స్థలం నుంచి పరారైన మహిళా సాయుధులను ప్రత్యేక బలగాలు చుట్టుముట్టాయి. ఓ బంగ్లాలో దాచుకున్న మహిళా ఉగ్రవాదులు, ప్రత్యేక బలగాల మధ్య దాదాపు గంటపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు.
ఈ దాడుల నేపథ్యంలో టర్కీలోని కుర్దీష్ ప్రాబల్యమున్న వాయవ్య ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ మిలిటెంట్లకు, ప్రభుత్వానికి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవ్వడంతో ఆ మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.