అమెరికా విమానంలో అనుకోని అతిథి! | UA flight delayed for hours after reports of scorpion onboard | Sakshi
Sakshi News home page

అమెరికా విమానంలో అనుకోని అతిథి!

Published Fri, May 12 2017 6:27 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

అమెరికా విమానంలో అనుకోని అతిథి! - Sakshi

అమెరికా విమానంలో అనుకోని అతిథి!

అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి ఈక్వెడార్‌లోని క్విటో నగరానికి వెళ్లాల్సిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. విమానంలోకి ఒక అనుకోని అతిథి దూరడమే అందుకు కారణమని విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి. విషయం ఏమిటంటే.. విమానంలో కూర్చున్న ఒక ప్రయాణికుడి దుస్తుల మీదుగా ఓ తేలు పాక్కుంటూ వెళ్లింది. విమానంలో తేలు కనిపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా గగ్గోలు పెట్టారు. అదృష్టవశాత్తు అది విమానంలో ఉన్న ఎవరినీ కుట్టలేదు కాబట్టి సరిపోయింది.

ఆ తేలు ఎక్కడుందో గుర్తించి, దాన్ని విమానం నుంచి కిందకు దించి మళ్లీ బయల్దేరడానికి మాత్రం మూడు గంటల సమయం పట్టింది. నిజానికి ఈ ఘటన జరిగే సమయానికి విమానం గేటు నుంచి కొద్ది దూరం వెళ్లింది. కానీ, తేలు విషయం తెలియగానే మళ్లీ దాన్ని వెనక్కి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులందరినీ కిందకు దించేసి వాళ్లను వేరే విమానంలోకి ఎక్కించారు. ఇటీవలి కాలంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ తరచు వార్తల్లో నిలుస్తోంది. తమ కుందేలు చనిపోవడానికి ఈ సంస్థే కారణమంటూ దాని యజమానులు కేసు పెడతామని కూడా ఇటీవల హెచ్చరించారు. అంతకుముందు ఓ ప్రయాణికుడిని విమానంలోంచి లాక్కుంటూ తీసుకెళ్లిన వీడియో బయటకు వచ్చింది. ఏప్రిల్ 14న అయితే ఇదే విమానయాన సంస్థకు చెందిన ఓ విమానంలో హ్యూస్టన్‌లోనే ఓ ప్రయాణికుడిని తేలు కుట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement