
దుబాయ్: హిందూ, ముస్లిం దంపతులకు జన్మించిన ఓ 9నెలల చిన్నారికి జనన ధ్రువీకరణ పత్రం జారీ చేయడం ద్వారా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రభుత్వం ఔదార్యతను చాటుకుంది. నిబంధనలను పక్కన పెట్టి మరీ భారత్‌కు చెందిన హిందూ తండ్రి, ముస్లిం తల్లికి జన్మించిన పాపకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు మీడియా తెలిపింది. యూఏఈలోని వివాహ చట్టం ప్రకారం ఓ ముస్లిం వ్యక్తి వేరే మతానికి చెందిన మహిళను వివాహమాడొచ్చు. కానీ ఓ ముస్లిం మహిళ మాత్రం ముస్లిమేతర వ్యక్తిని వివాహం చేసుకోరాదు. హిందువైన కిరణ్ బాబు, ముస్లిం యువతి సనమ్ సాబూ సిద్ధికీ 2016లో కేరళలో వివాహం చేసుకున్నారు. షార్జాలో నివాసముంటున్నారు. వీరికి జూలై 2018లో పాప జన్మించింది.
కిరణ్ హిందువు కావడంతో అతని కూతురికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. దీంతో యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్షౖకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నిబంధనలు మార్చి అధికారులు జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. దేశంలో ఇదే మొదటిసారి అని కిరణ్ పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు సహకరించిన ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ ఎమ్.రాజమురుగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఔదార్యతను ప్రదర్శించే దేశంగా ముందుండటానికి యూఏఈ 2019 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టాలరెన్స్‌గా ప్రకటించింది. రెండు భిన్న సంస్కృతులను కలిపేలా, ఇతర మతంలోని వారిని అనమతించే దిశగా ఈ చర్యలు చేపట్టింది.