
న్యూయార్క్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను నివారించేందుకు ఇరు దేశాలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ పిలుపునిచ్చారు. ఇందుకు తాము పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ మాట్లాడుతూ..‘ పుల్వామా ఉగ్రదాడి కారణంగా ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి ఇబ్బందులను తగ్గించుకునేందుకు వారు ముందుకు రావాలి. అదే విధంగా వారు కోరినట్లైతే ఇరు దేశాలకు మా సహాయ సహకారాలు ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు.
ఇక పుల్వామా దాడిపై విచారణ జరిపేందుకు జమ్మూలో ప్రయాణిస్తున్న యూఎన్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా-పాకిస్తాన్(యూఎన్‌ఎమ్‌ఓజీఐపీ) బృందానికి ఇబ్బందులు తలెత్తుతున్న విషయాన్ని స్టెఫానే ప్రస్తావించారు. యూఎన్‌ఎమ్‌ఓజీఐపీ వాహనంపై కొంత మంది నిరసనకారులు పాకిస్తాన్ జెండా ఉంచి ఆందోళనకు దిగారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ బృందానికి మరింత భద్రత పెంచాలని భారత్‌ను కోరినట్లు వెల్లడించారు.(దాడి చేస్తే.. ఊరుకోం!)
కాగా పుల్వామా ఘటన కారణంగా ప్రస్తుతం భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా ఐరాసను పాకిస్తాన్ కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు... ‘ ‘పాకిస్తాన్‌పై భారత్ బలాన్ని ప్రయోగిస్తుందనే ఆందోళనలతో మా ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. విచారణ కూడా చేయకుండానే పుల్వామాలో ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కారణమనడం అర్థరహితం. ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు తీసుకోవడం అనివార్యం. ఇందుకోసం ఐరాస తప్పక రంగంలోకి దిగాలి’ అని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐరాసకు లేఖ రాశారు. అయితే భారత్, పాక్‌ల మధ్య మూడో దేశం లేదా సంస్థ జోక్యాన్ని భారత్ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఏ సమస్యైనా ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment