కరాచీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా వైరస్ బారిన పడ్డాడా? అవునని కొందరు కాదని కొందరు చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచి ముంబై నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఈ కరడుగట్టిన తీవ్రవాది దావూద్ భార్య మెహజబీన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందని, దీంతో దావూద్ వ్యక్తిగత సిబ్బందితోపాటు రక్షణ వ్యవహారాలను చూసే వారందరినీ క్వారంటైన్‌లో ఉంచినట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాలు ప్రచురించగా.. అలాంటిదేమీ లేదని ‘భాయ్’ఆరోగ్యంగానే ఉన్నాడని అతడి తమ్ముడు అనీస్ ఇబ్రహీం తమతో చెప్పినట్లు ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థ ఇంకో కథనాన్ని ప్రచురించింది. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో జన్మించిన దావూద్ 1993 నాటి ముంబై పేలుళ్లకు కుట్ర పన్నిన విషయం తెలిసిందే.
1994 నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలో ఐఎస్‌ఐ ఆశ్రయంలో ఉంటున్న దావూద్ ప్రస్తుతం కరోనా బారిన పడి కరాచీ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతడి భార్య మెహజబీన్‌కూ వ్యాధి సోకిందని పీటీఐ తదితర వార్తా సంస్థలు తెలిపాయి. మరోవైపు.. ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థ దావూద్ ఇబ్రహీం తమ్ముడు అనీస్ ఇబ్రహీంతో తాము ఫోన్‌లో మాట్లాడామని దావూద్ కుటుంబంలో ఎవరికీ కరోనా సోకలేదని అనీస్ చెప్పినట్లు పేర్కొంది. పాక్‌తోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మాఫియా కూడా కార్యకలాపాలను నడుపుతున్నట్లు అనీస్ అంగీకరించినట్లు వెల్లడించింది. ‘‘భాయ్ బాగున్నాడు. షకీల్ కూడా. మా ఇంట్లో ఎవరికీ కరోనా సోకలేదు. ఎవరూ ఆసుపత్రిలో చేరలేదు’’అని అనీస్ చెప్పినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment