ప్రపంచంలో 6.5 కోట్ల మంది వలసలు
న్యూయార్క్ : పుట్టిన గడ్డను వదిలేసి పరాయి ప్రాంతానికి వెళ్లాలంటే ఎవరికైనా బాధాకరమే. బ్రతుకు తెరువు కోసం కాకుండా ప్రాణ భీతితో పరాయి ప్రాంతమో, పరాయి దేశమో వెళ్లాలంటే మరింత బాధాకరం. సంఘర్షణలు, అంతర్యుద్ధాలు, అల్లర్లు, మానవ హక్కుల ఉల్లంఘన పరిస్థితుల్లో బ్రతుకు జీవుడా అంటూ పరాయి ప్రాంతాలకు ప్రజలు వలసపోక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర కోట్ల మంది ప్రజలు ఇప్పటికే వలసపోయారని, రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచి ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు స్థానభ్రంశం చెందటం ఇదే మొదటిసారని ఐక్యరాజ్యసమితి కాందిశీకుల సంస్థ యూఎన్హెచ్సీఆర్ ఓ నివేదికలో తెలియజేసింది.
స్థానభ్రంశం చెందిన ప్రజలు ఆరున్నర కోట్ల మందంటే మొత్తం ప్రపంచ జనాభాలో 0.8 శాతం మంది. మరో విధంగా చెప్పాలంటే ఓ ఫ్రాన్స్ జనాభా లేదా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల జనాభా కలిపితే ఎంతనో అంత. వీరిలో ఒక దేశంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినవారు. ఓ దేశం నుంచి మరో దేశానికి సరిహద్దులు దాటి వెళ్లిన వారు ఉన్నారు. అలా వెళ్లిన వారిలో కాందిశీకులతోపాటు శరణార్థులు కూడా ఉన్నారు. పెద్ద వాళ్లకన్నా పిల్లలే ఎక్కువగా ఉండడం గమనార్హమైన విషయం. ఒక్క 2015 సంవత్సరంలోనే 58 లక్షల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వలసపోయారు.
ఇలా ప్రపంచం నలుమూలల నుంచి వలసలు వచ్చిన వారిలో ఎక్కువ మందికి ఆశ్రయం ఇస్తోంది మధ్యప్రాచ్య ప్రాంతమే. ఇక్కడి ప్రతి 20 మందిలో ఒకరు వలస వచ్చిన వారే ఉంటున్నారు. వారిలో ఎక్కువ మంది అంతర్యుద్ధం కొనసాగుతున్న సిరియా నుంచి వచ్చిన ప్రజలే. 2011లో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి 50 లక్షల మంది పరాయి దేశానికి వెళ్లగా అంతర్గతంగా 66 లక్షల మంది ప్రజలు వలసపోయారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వలసపోయిన వారిలో ప్రతి ఐదుగురు పౌరుల్లో ఒకరు సిరియన్ ఉన్నారు. కొలంబియాలో 69 లక్షల మంది, ఇరాక్లో 47 లక్షల మంది దేశంలోనే మరో ప్రాంతానికి వలసపోయారు. ప్రపంచంలోనే టర్కీ గతేడాది 25 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది.