ఇక్కడ మూత్రం చేస్తే ఇక అంతే...
శాన్ఫ్రాన్సిస్కో: ఎక్కడ గోడ కనపడితే అక్కడ లఘుశంక తీర్చుకునే మగ మహారాజులకు ఇప్పుడు చుక్కెదురైనట్టే. ఏం.. ఎందుకు అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. త్రీ ఇడియట్స్ సినిమాలో సీనియర్ మూత్రం పోస్తానంటే స్పూను పెట్టి, దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చే సీన్ చూసే ఉంటారు కదూ.
ఇంతవరకు మనం గోడకు కొట్టిన బంతి గురించి విన్నాం.. చూశాం.. ఇది పాతదే. కానీ ఇపుడు గోడక్కొట్టిన సు.. స్సూ.. అంతే వేగంగా తిరిగి మొఖం మీద పడటం ఖాయమట. ఇది కొత్త విషయం. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి.. నగరాన్ని మురికికూపంగా మారుస్తున్న వైఖరికి స్వస్తి చెప్పేందుకు శాన్ఫ్రాన్సిస్కోలోని అధికారులు ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నగరంలోని బార్లు, హోటెళ్లు, బస్లాండ్లు తదితర ఏరియాల్లో గోడలకు ఒక పెయింట్ వేశారు. దాంతో పాటు ఒక స్లోగన్ను కూడా జత చేర్చారు. 'ఆగండి.. ఇక్కడ కాదు... దాని కోసం వేరే చోటు వెదుక్కోండి.. లేదంటే మీ మూత్రం మీ మొఖం మీదికే' అని బోర్డులు తగిలించేశారు.
అల్ట్రా ఎవర్ డ్రై గా పిలిచే ఈ పెయింట్ వేసిన గోడలపై నీళ్లు, లేదా ఏదైనా ద్రవపదార్థం పడితే, అది అంతే వేగంగా వెనక్కి వెదజల్లుతుంది. ఈ పెయింట్‌కు సూపర్ హైడ్రోఫోబిక్ (నీటిని వికర్షించే శక్తి) గుణం ఉండడం వల్ల ఎవరైనా మూత్రం చేస్తే ఆ మూత్రం తిరిగి వారిమీదే పడుతుందని అధికారులు వెల్లడించారు. సిమెంట్ కంపెనీ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ ఈ పెయింటును తయారు చేసిందని సమాచారం.
ఇటీవల జర్మనీ అనుసరించిన ఈ విధానం గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. జర్మనీలోని హాంబర్గ్ వాసులు సెయింట్ పాలి నైట్‌క్లబ్ ప్రాంతంలో ఆచరించిన ఈ పద్ధతికి ఎట్రాక్ట్ అయ్యారు. వెంటనే తమ నగరంలోని పలు గోడలకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ పెయింట్లు వేయించారట. దీంతో తమ ప్రాంతంలో కూడా ఈ పెయింట్లు వేయించండి బాబూ అని నగర వాసుల నుంచి విపరీతంగా కాల్స్ వస్తున్నాయట.
ఇలాంటి అవకాశం మనకు కూడా వస్తే.. గోడల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రపంచ పటాలు దర్శనం ఇవ్వకుండా ఉంటాయి.