వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు గురువారం ప్రతినిధుల సభలో వీగిపోయింది. దేశాల వారీ గ్రీన్‌కార్డు కోటాను రద్దు చేయడంతో పాటు భారత్ వంటి వర్ధమాన దేశాల పౌరులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వెళ్లేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపర్చిన సంగతి తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు బాబ్ గుడ్‌లాటె ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 121 ఓట్లు, వ్యతిరేకంగా 301 ఓట్లు పడ్డాయి.
ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని ఓటింగ్‌కు ముందు ట్రంప్ ఇరు పార్టీల సభ్యులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. రిపబ్లికన్లు ఏకపక్షంగా ప్రవేశపెట్టిన మరో బిల్లు ఓటమిపాలైందని డెమొక్రటిక్ పార్టీ విప్ హోయర్ వ్యాఖ్యానించారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమయ్యేలా బిల్లులో మార్పులు చేయడమే మిగిలిన ఏకైక మార్గమని మరో సభ్యుడు టాడ్ షూల్టె అన్నారు. చట్టబద్ధంగా వలసొచ్చే వారికి తాజా బిల్లు ప్రతికూలంగా మారిందని, వలస కుటుంబాలు, వారి పిల్లల నిర్బంధాన్ని సమర్థించేలా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment