కేన్సర్‌పై పోరాటానికి నోబెల్‌ | US, Japan duo win Nobel Medicine Prize for cancer therapy | Sakshi
Sakshi News home page

కేన్సర్‌పై పోరాటానికి నోబెల్‌

Published Tue, Oct 2 2018 3:31 AM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM

US, Japan duo win Nobel Medicine Prize for cancer therapy - Sakshi

తసుకు హొంజో, జేమ్స్‌ అలిసన్‌

స్టాక్‌హోం: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి కేన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు శాస్త్రజ్ఞులను ఈ ఏడాది వైద్య నోబెల్‌ వరించింది. వ్యాధి నిరోధక శాస్త్రనిపుణులైన అమెరికా వైద్యుడు జేమ్స్‌ అలిసన్‌ (70), జపాన్‌కు చెందిన తసుకు హొంజో (76)లను నోబెల్‌ వైద్య బహుమతికి విజేతలుగా ఎంపిక చేసినట్లు జ్యూరీ సోమవారం ప్రకటించింది. కేన్సర్‌ రోగాన్ని నయం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో నేరుగా కేన్సర్‌ కణాలనే లక్ష్యంగా చేసుకుని వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అలిసన్, హొంజోలు మాత్రం ఇమ్యునోథెరపీ అనే కొత్త విధానంలో మరింత వేగంగా కేన్సర్‌ను తగ్గించేందుకు రోగి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఎలా సాయపడుతుందనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు. వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు ఉత్పత్తి చేసే ప్రొటీన్లను చికిత్సలో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కేన్సర్‌ కణాలను వేగంగా చంపేసే విధానాన్ని జేమ్స్‌ అలిసన్, తసుకు హొంజోలు అభివృద్ధి చేశారు. బహుమతులను ప్రకటించిన అనంతరం నోబెల్‌ అసెంబ్లీ సభ్యులు మాట్లాడుతూ ‘వీరి చికిత్సా విధానం కేన్సర్‌ను నయం చేయడంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

కేన్సర్‌ చికిత్స విషయంలో మన దృక్పథాన్ని సమూలంగా మార్చింది’ అని శ్లాఘించారు. ‘రోగ నిరోధక శక్తి కణాలకు కేన్సర్‌ కణాలపై పోరాడే సామర్థ్యం ఉందనే విషయాన్ని గుర్తించిన వ్యక్తి అలిసన్‌. అలాగే రోగ నిరోధక కణాలపై పీడీ–1 అనే ప్రొటీన్‌ను గుర్తించి అది కూడా కేన్సర్‌ కణాలపై పోరాటానికి బాగా ఉపయోగపడుతుందని తసుకు హొంజో తెలియజెప్పారు’ అని నోబెల్‌ జ్యూరీ ఓ ప్రకటనలో తెలిపింది. నోబెల్‌ బహుమతి విలువ 1.01 మిలియన్‌ డాలర్లు కాగా, ఆ మొత్తాన్ని అలిసన్, హొంజోలు చెరిసగం పంచుకుంటారు. అల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి రోజైన డిసెంబర్‌ 10న స్టాక్‌హోంలో స్వీడన్‌ రాజు కార్ల్‌–16 వీరికి బహుమతిని అందజేస్తారు.

గౌరవంగా ఉంది: అలిసన్‌
‘ప్రఖ్యాత నోబెల్‌ బహుమతి గెలుచుకోవడం ఆనందంగా, గౌరవంగా ఉంది. నా పరిశోధన ఇంత గొప్పగా అవుతుందని కలలో కూడా ఊహించలేదు. రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి అందించిన చికిత్స ద్వారా కోలుకున్న రోగులను కలుసుకోవడం గొప్ప ఉద్విగ్నంగా ఉంటుంది. ప్రాథమిక విజ్ఞాన శాస్త్రానికి, కేన్సర్‌కు రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకున్న మా జిజ్ఞాసకు ఆ రోగులే సజీవ సాక్ష్యాలు’ అని జేమ్స్‌ అలిసన్‌ వెల్లడించారు. శరీర వ్యాధి నిరోధక శక్తిలో అత్యంత కీలకమైన టీ–సెల్స్‌ (తెల్ల రక్త కణాల్లో ఒక రకం)పై నిరోధక గ్రాహంగా సీటీఎల్‌ఏ–4 అణువు పనిచేస్తుందని 1995లో గుర్తించిన ఇద్దరు శాస్త్రజ్ఞుల్లో అలిసన్‌ ఒకరు.

మరింత మందిని కాపాడుతా: హొంజో
తసుకు హొంజో జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. నోబెల్‌ బహుమతిని ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగ నిరోధక వ్యవస్థను ఉపయోగించి గతంలో కన్నా అత్యంత ఎక్కువ మంది కేన్సర్‌ రోగులను కాపాడేందుకు తన పరిశోధనను కొనసాగిస్తానని చెప్పారు. ‘నా కృషి వల్లే రోగం నయమైందని ఎవరైనా రోగులు చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులుండవు. నా గోల్ఫ్‌ క్లబ్‌లో సభ్యుడైన ఓ వ్యక్తి ఓ రోజు నా దగ్గరికి వచ్చి.. మీ వైద్యం వల్లే నేను బతికున్నాను. ఊపిరితిత్తుల కేన్సర్‌ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. అంతకన్నా ఆనందం ఏముంటుంది?’ అని చెప్పారు.

ఏమిటీ ఇమ్యునోథెరపీ?
కేన్సర్‌ చికిత్సకు అందుబాటులోకి వచ్చిన కొత్త పద్ధతే ఈ ఇమ్యునోథెరపీ. అడ్డూఅదుçపూ లేకుండా విభజితమయ్యే కేన్సర్‌ కణాలను నాశనం చేసేందుకు ప్రస్తుతం కీమోథెరపీ, లేజర్‌ సహా పలు రకాల చికిత్సలు వాడతున్నాం. ఇమ్యునోథెరపీలో శరీర రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలే (టీ–లింఫోసైట్స్‌–తెల్ల రక్తకణాల్లో ఓ రకం) కేన్సర్‌ కణాలను గుర్తించి నాశనం చేసేలా చేస్తారు. ఇమ్యునోథెరపీలో మూడు రకాలు ఉన్నాయి.

రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు చెక్‌పాయింట్‌ ఇన్‌హిబిటర్స్‌ వీటిల్లో ఒకటి. ఆరోగ్యకరమైన కణాలు, కేన్సర్‌ కణాల మధ్య తేడాను టీ–కణాలు గుర్తించేందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రొటీన్‌ రిసెప్టార్లను వాడతారు. వీటిని చెక్‌పాయింట్స్‌ అంటారు. సాధారణంగా కేన్సర్‌ కణాలు కూడా మామూలు కణాల్లాగే టీ–సెల్స్‌కు సంకేతాలు పంపుతుంటాయి. దీంతో కేన్సర్‌ కణాలేవో, ఆరోగ్యకరమైన కణాలేవో టీ–సెల్స్‌ గుర్తించలేవు. ఇమ్యునోథెరపీలో కొన్ని ప్రత్యేకమైన మందుల ద్వారా ఈ సంకేతాలను నిలిపివేసి టీ–కణాలు కేన్సర్‌ కణాలను గుర్తించేలా చేస్తారు.  

ఇక రెండో రకం ఇమ్యునోథెరపీలో సైటోకైన్స్‌ను వాడతారు. రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసే ప్రత్యేక రసాయనాలే ఈ సైటోకైన్స్‌. ఈ ప్రత్యేక రసాయనాల ద్వారా టీ–సెల్స్‌ అధికమై అవి కేన్సర్‌ కణాలపై దాడి చేస్తాయని అంచనా. చివరగా మూడో పద్ధతి... వ్యాక్సిన్లు. కొన్ని కేన్సర్ల విషయంలో ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్లను ఉపయోగిస్తారు. మిగిలిన వాటిల్లో వ్యాధి సోకిన తరువాత కూడా టీ–కణాల్లో కొత్త శక్తిని నింపి కేన్సర్‌ కణాలపై దాడి చేసేలా చేసేందుకు వ్యాక్సిన్లు ఉపయోగపడతాయి. ఈ పద్ధతిలో రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తారు కాబట్టి దాని ప్రభావం కొన్ని ఆరోగ్యకరమైన కణాలపై కూడా పడుతూంటుంది. ఫలితంగా విపరీతమైన నీరసం, వికారం, ఆకలి మందగించడం, దగ్గు వంటి సమస్యలు ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement