
‘ఉత్తర కొరియా రెచ్చగొట్టొద్దు.. చర్చలకు రా’
వాషింగ్టన్: ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలు మానుకుంటే మంచిదని అమెరికా హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించాలే తప్ప రెచ్చగొట్టే చర్యలకు దిగితే మంచిది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెంటగాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘అంతర్జాతీయ ఒప్పందాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఉత్తర కొరియా సీరియస్‌గా చర్చలకు రావాలి. అసుస్థిర పరిస్థితులు కల్పించే యత్నాలు, రెచ్చగొట్టే చర్యలు ఆపేయాలి. ఉత్తర కొరియా చట్ట విరుద్ధంగా చేస్తున్న క్షిపణుల కార్యక్రమాలు అమెరికా జాతీయ భద్రతకు బెదిరింపుగానే భావిస్తున్నాం. ఈ విషయంలో ఇంతకంటే ముందుకు పోవడం మంచిది కాదు’ అని పెంటగాన్ స్పష్టం చేసింది. అమెరికా యుద్ధ నౌకను ఒకే దెబ్బకు ముంచి వేస్తామంటూ ఉత్తర కొరియా ప్రకటించిన మరుసటి రోజే అమెరికా ఇలా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.