
సాక్షి, న్యూఢిల్లీ : ఈ రోజుల్లో సోషల్ మీడియాను టెర్రరిస్టులు, మాఫియాలు కూడా వాడుతున్న విషయం తెల్సిందే. ఒకరి పేరు మీద మరొకరు దొంగ ఖాతాలను కలిగి ఉండడం వల్ల అది సాధ్యమవుతోంది. ఇక ముందు అలా జరుగకుండా నిరోధించేందుకు ‘మీరు మీరేనా’ రుజువు చేసుకునేందుకు ‘ఫేస్‌బుక్’ రహస్యంగా ఓ తనిఖీ కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టినట్లు తెల్సింది. అందులో భాగంగా ఫేస్‌బుక్ ఖాతాదారుల ముఖాన్ని సెల్ఫీ వీడియో తీసి పంపించుమని కోరుతుంది. ఆ వీడియా ద్వారా ‘మీరు మీరేనా, కాదా?’ అన్న విషయాన్ని ధ్రువీకరించుకుంటోంది.
కంటి ముందు వరకు మొబైల్‌ను ఎత్తుపట్టుకొని కెమేరా స్క్రీన్ మీద కనిపించే వృత్తంలో మొఖం పూర్తిగా వచ్చేలా సర్దుకోవాలి. స్క్రీన్ మీదకు సూటిగా చూస్తూ, అక్కడి నుంచి కుడికి, మళ్లీ పూర్తి ఎడమకి తలను తిప్పి మళ్లీ ముఖాన్ని సూటిగా తీసుకురావాలి. దీన్ని సెల్ఫీ తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ వీడియోను ఎవరికి చూపించమని కూడా కంపెనీ వర్గాలు హామీ ఇస్తున్నాయి. ‘మీరు మీరేనా’ అనే విషయాన్ని రుజువు చేసుకొని నెల రోజుల్లో వీడియోను డిలీట్ చేస్తామని కూడా చెబుతున్నాయి. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించకుండానే ఫేస్‌బుక్ యాజమాన్యం గోప్యంగా పరిమిత స్థాయిలో సెల్ఫీ వీడియో కార్యక్రమాన్ని చేపట్టింది. త్వరలోనే దీన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవసీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అమెరికాలోని ఇలినాయీ కోర్టు ‘ఫేస్‌బుక్’ యాజమాన్యానికి భారీ జరిమానా విధించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఫేస్‌బుక్ గోప్యంగా నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment