జోంగ్ నామ్ శరీరంలో ఆ విషం
జోంగ్ నామ్ శరీరంలో ఆ విషం
Published Fri, Feb 24 2017 9:43 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
కౌలాలంపూర్: ఉత్తర కొరియా నియంత కింగ్ జోంగ్ ఉన్ సోదరుడు కిమ్ జోంగ్ నామ్ శరీరంలోకి అత్యంత విషపూరితమైన కెమికల్‌ను పంపి ఆయన్ను హత్య చేసినట్లు మలేసియా పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు మలేసియా పోలీసులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నామ్ కళ్లు, ముఖంలోని మరికొద్ది భాగాల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో వీఎక్స్ నర్వ్ ఏజెంట్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించారు. ఈ విషాన్ని వీఎక్స్ నర్వ్ ఏజెంట్ లేదా ఎస్-2 డైసోప్రొఫైలమైనోఈథైల్ మిథైల్‌ఫాస్ఫోనోథియోలైట్ అని కూడా పిలుస్తారు. దీని వినియోగంపై యూనైటెడ్ నేషన్స్‌లో నిషేధం ఉంది.
మకావు వెళ్లేందుకు కౌలాంలంపూర్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన నామ్‌పై ఇద్దరు మహిళలు దాడి చేసి చంపారు. నామ్‌ను హతమార్చిన ఇరువురూ ఉత్తరకొరియా ఏజెంట్లేనని దక్షిణ కొరియా, అమెరికా దేశాల అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఎయిర్‌పోర్టు వీడియోను దక్షిణ కొరియాకు చెందిన ఓ టీవీ ప్రసారం చేసింది. నామ్ వెనుక నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు ఆయన ముఖంపై విషాన్ని స్ప్రే చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వీఎక్స్ నర్వ్ ఏజెంట్‌ను కేవలం పార్మారంగ పరిశోధనలకు మాత్రమే వినియోగిస్తారు. క్రీమ్, లిక్విడ్ తదితర రూపాల్లో ఇది లభ్యమవుతుంది. పొరబాటున ఈ మిశ్రమాన్ని ఎవరైనా తాకితే 15 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాగా నిందితులను పట్టుకునేందుకు మలేసియా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను అలర్ట్ చేసింది. పోలీసులు ఇప్పటికే ఓ ఉత్తర కొరియా జాతీయుడిని అదుపులోకి తీసుకోగా.. కేసుకు సంబంధించిన మరో ఏడుగురు అనుమానితులు పరారీలో ఉన్నారు.
Advertisement