ఆసియా, మధ్యప్రాచ్యాల్లో వేగం తక్కువే.. | Warmer climates will slow coronavirus spread | Sakshi
Sakshi News home page

కరోనా.. వాతావరణం

Published Fri, Mar 27 2020 5:16 AM | Last Updated on Fri, Mar 27 2020 9:51 AM

Warmer climates will slow coronavirus spread - Sakshi

బోస్టన్‌: వెచ్చటి వాతావరణం... గాలిలో తేమశాతం అధికంగా ఉండటం! ప్రాణాంతక కరోనా వైరస్‌ను అడ్డుకునే ఆయుధాలని తేల్చారు బోస్టన్‌లోని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. చైనాలోని వూహాన్‌ నగరంలో గత ఏడాది డిసెంబరులో గుర్తించింది మొదలు.. ఈ నెల 22వ తేదీ వరకూ వివిధ దేశాలకు విస్తరించిన తీరు.. ఆయా దేశాల్లోని ఉష్ణోగ్రతలు, గాల్లో తేమశాతాలను అంచనా వేయడం ద్వారా ఖాసీమ్‌ బుఖారీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాకు వచ్చింది.

‘ఎస్‌ఎస్‌ఆర్‌ఎన్‌ రిపాసిటరీ’జర్నల్‌లో ఈ అధ్యయనం తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. మార్చి 22వ తేదీ వరకూ ఉన్న కరోనా కేసులన్నింటిలో 90 శాతం కేసులు ఉష్ణోగ్రతలు మూడు నుంచి 17 డిగ్రీ సెల్సియస్‌లు ఉన్న ప్రాంతాల్లోనే సంభవించాయని ఈ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు.. ఈ ప్రాంతాల్లో గాల్లో తేమశాతం ప్రతి ఘనపు మీటర్‌ గాలిలో నాలుగు నుంచి తొమ్మిది గ్రాముల వరకూ ఉందని వీరు చెప్పారు.

జనవరి నుంచి మార్చి నెల మొదటి వరకూ సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీ సెల్సియస్, గాల్లో తేమశాతం ఘనపు మీటర్‌కు తొమ్మిది గ్రాములు ఉన్న ప్రాంతాల్లో కేవలం ఆరు శాతం కేసులే ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఈ లెక్క ప్రకారం ఆసియా దేశాల్లో రుతుపవనాల్లాంటి వాతావరణం ఏర్పడితే వైరస్‌ వ్యాప్తి తగ్గే అవకాశముంది. ఈ రకమైన వాతావరణంలో గాల్లో తేమశాతం ఘనపుమీటర్‌కు 10 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటుందని, అక్కడ ఈ వైరస్‌ వేగంగా వ్యాపించదని వీరు అంచనా కట్టారు. ‘ చల్లని ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు ఉంటే.. వెచ్చటి వాతావరణమున్న దక్షిణ రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయి. దక్షిణ ప్రాంతానితో పోలిస్తే ఉత్తరాన రెట్టింపు కేసులు ఉన్నాయి’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆసియా, మధ్యప్రాచ్యాల్లో వేగం తక్కువే..
చైనా, యూరప్‌ దేశాలు, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల మాదిరిగా క్వారంటైన్‌ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టకపోయినా పలు ఆసియాదేశాల్లో, మధ్యప్రాచ్య, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. భారత్, పాకిస్తాన్, ఇండోనేసియా వంటి దేశాల్లో పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కేసులు కనపడటం లేదని కొంతమంది వాదిస్తున్నారని.. అయితే ఈ దేశాల్లో ఉండే వాతావరణమే ఉండే సింగపూర్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేసినా కేసులు తక్కువగానే ఉన్నాయని  గుర్తు చేశారు. కాబట్టి తగినన్ని పరీక్షలు చేయడం అన్నది సమస్య కాదని స్పష్టం చేశారు. ఇతర అంశాల కంటే కదలికలను నియంత్రించడం, క్వారంటైన్‌ పాటించడం ద్వారా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేయవచ్చునని తెలిపారు. అయితే, వైరస్‌ ఎలా మార్పు చెందుతోంది? పరిణమిస్తోంది? పునరుత్పత్తి వేగం వంటి అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే భిన్నమైన అంచనాలు రావచ్చునని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement