70శాతం మహిళలపై అత్యాచారం!
పపువా న్యూగినియా: పపువా న్యూగినియాలో 'లిలి జో' అనే మహిళకు నలుగురు పిల్లలు. ఆమె గత ఏడాది ప్రారంభం నుంచి జైలులో ఉంటోంది. తన ఏడాది కుమారుడు కూడా తనతోపాటే ఉన్నాడు. ఇంతకీ ఆమె ఏదైనా నేరం చేసిందా అంటే అదేంకాదు. మరి నేరం చేయనప్పుడు కావాలని జైలులో.. ఆ చీకటి గదిలో ఎందుకు ఉంటోందని అనుకుంటున్నారా.. అందుకు ప్రధాన కారణం అక్కడ మహిళలకు ఏ మాత్రం భద్రత లేకపోవడమే. ఎక్కడ ఉన్నా తనపై ఏదో ఒకరకమైన దాడి తప్పదని భావించిన జో.. తన ఏడాది కుమారుడితోపాటు జైలు అధికారులను బ్రతిమిలాడుకొని పోర్ట్ మోరెస్బీ అనే జైలులో ఉంటోంది. సాధారణంగా రక్షణకోసం ఎన్నో రకాల మార్గాలు ఉన్నా వాటిపై నమ్మకం లేక ఒక మహిళ ఏకంగా జైలు ఆశ్రయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆ దేశంలో మహిళల దుర్భర స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పపువా న్యూగినియా పసిఫిక్ తీరాన ఉన్న ఓ చిన్న ద్వీపం. ఆస్ట్రేలియాకు 100 మైళ్ల దూరంలో ఉంది. సాధారణంగానే ఎక్కువ ఎజెన్సీ ప్రాంతాన్ని కలిగి ఉండటంతోపాటు గిరిజన జనాభాను కూడా అధికంగా కలిగిన ఈ దేశం ఇప్పుడు ఓ ముఖ్య విషయం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. అదే మహిళలపై అత్యాచారాల ఘటనల అంశంతో.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 70శాతం మంది మహిళలు తమ జీవిత కాలంలో లైంగిక దాడులకు, భౌతిక దాడులకు గురవుతున్నారని అక్కడి తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. దాదాపు 50శాతం మంది మహిళలు తమ వివాహ సమయానికంటే ముందే ఈ ఆకృత్యాలకు బలవుతున్నారని కూడా ఆ అధ్యయనం వెల్లడించింది.
కాగా, వీరిపై ఈ అరాచకాలకు పాల్పడేవారు 40శాతం మంది పురుషులు వివాహం అయినవారేనని కూడా ఆ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఈ ద్వీపం గురించి 'ప్రపంచంలోనే ఈ ద్వీపం మహిళలకు అత్యంత అపాయకరమైనది' అని వెల్లడించింది. ఈ ద్వీపంలోని జనాభాలో 70శాతం మంది అంటే దాదాపు 70 లక్షల మంది మహిళలు తమ జీవిత కాలంలో అత్యాచారానికో, శారీరక హింసలకు గురైన వారే ఉన్నారని పేర్కొంది. మహిళలను ఎంత దారుణంగా హింసించేవారంటే అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి ఈడ్చి కొడుతుండేవారు.
ఇలాంటి దృశ్యాలను చూపించే వీడియోలు, ఫొటోలు ఇప్పటికే కోకొల్లలుగా ఉన్నాయి. మహిళలపై అసలు ఈ ఆకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయని పరిశీలిస్తే.. లైంగిక, భౌతిక దాడులకు పాల్పడే పురుషుల నుంచి రక్షించేందుకు ఎలాంటి రక్షణ వ్యవస్థ లేకపోవడం ఒక కారణమైతే, నిరక్షరాస్యత, మౌడ్యం, మూర్ఖత్వం, పురుషత్వ అహంకారం కూడా ఇక్కడ ప్రజ్వరిల్లుతోంది. అంతేకాకుండా నిత్యం పేదరికంతో సతమతమవుతున్న ఈ ద్వీపంలో ఆస్పత్రులకు, వైద్య సేవలకు కావాల్సిన నిధులు అందడం లేదు. అంతేకాకుండా కఠిన చట్టాలు కూడా లేకపోవడం మరొక కారణం. 1971లో ఆ ప్రాంతంలో తీసుకొచ్చిన ఓ చట్టం కూడా అక్కడ మహిళలను వేధించేందుకు అనుకూలంగా ఉంది.