క్యాబ్ ఎందుకు?? హెలికాప్టర్ బుక్ చేద్దాం!!
2016, అక్టోబర్ 24..
మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లాలి.. కిశోర్ స్మార్ట్‌ఫోన్ తీశాడు.. క్యాబ్ బుక్ చేశాడు..
2020, అక్టోబర్ 24..
మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లాలి.. కిశోర్ మళ్లీ స్మార్ట్‌ఫోన్ తీశాడు.. అయితే.. ఈసారి హెలికాప్టర్(ఎయిర్ ట్యాక్సీ) బుక్ చేశాడు..
ఫ్రాన్స్ ఏరోస్పేస్ దిగ్గజం ‘ఎయిర్‌బస్’ చేపడుతున్న ప్రాజెక్టు వాహన విజయవంతమైతే.. స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పుడు ట్యాక్సీలు బుక్ చేసుకున్నట్లు ఎగిరే ట్యాక్సీలు బుక్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ జామ్‌ల వంటి సమస్యలు కూడా ఉండవు. హెలికాప్టర్ తరహాలో ఉండే ఈ ‘వాహన’లో ఒకరు ప్రయాణించవచ్చు. డ్రైవర్ అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా నిర్దేశిత ప్రదేశానికి వెళ్తుంది. ‘దీనికి రన్‌వే అవసరం లేదు. సెల్ఫ్ డ్రైవింగ్.. దారిలో ఉన్న ఇతర ఎయిర్ ట్యాక్సీలు, ప్రతిబంధకాలను గుర్తించే వ్యవస్థ ఇందులో ఉంటుంది. దాని వల్ల ప్రమాదాల ప్రశ్నే తలెత్తదు.
పైలట్ అవసరం లేని తొలి సర్టిఫైడ్ ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా దీన్ని రూపొందించనున్నాం’ అని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాడిన్ లేసాఫ్ తెలిపారు. 2017 చివరికి పూర్తి స్థాయి నమూనాను తయారుచేసి పరీక్షించనున్నారు. 2020లో మార్కెట్లోకి తేనున్నారు. 2030 నాటికి ప్రపంచ జనాభాలో 60 శాతం నగరాల్లోనే నివసిస్తారని ఎయిర్‌బస్ అంచనా వేస్తోంది. దానికి తగ్గట్లు ట్రాఫిక్ సమస్య కూడా మరింత జటిలమవుతుందని అంటూ.. 2015 నాటికే మెగాసిటీలుగా ఉన్నవాటిని, 2030 నాటికి మెగాసిటీలుగా మారేవాటిని ఎయిర్‌బస్ గుర్తించింది. 2030 నాటికి మెగా సిటీలుగా మారేవాటిలో హైదరాబాద్ కూడా ఉంది. 2015లో నగర జనాభాను 89 లక్షలుగా పేర్కొన్న ఎయిర్ బస్.. 2030 నాటికి అది 1.27 కోట్లు అవుతుందని అంచనా వేసింది. అంటే.. ఎయిర్‌ట్యాక్సీలు మన మార్కెట్లోకి కూడా వచ్చే చాన్సుందన్నమాట.