మోడల్స్ క్యాట్వాక్లో నవ్వకూడదా?
సరికొత్త ఫ్యాషన్లను, డిజైన్లను మార్కెట్లో పరిచయం చేయడానికి ప్రత్యేక వారధులు ఫ్యాషన్ మోడల్స్. ఓ కొత్త ట్రెండ్ ను సెట్ చేయడంలోనూ వారిది ప్రధాన పాత్రగా కనిపిస్తుంది. అటువంటి మోడల్స్.. క్యాట్ వాక్ చేసేటప్పుడు ఎందుకు గంభీరంగా ఉండాలి అన్నది కొందరి ప్రశ్న. నవ్వడం వల్ల నష్టం ఏముంది అంటూ కొందరు వాదించడం కూడ కనిపిస్తుంది. అయితే మోడల్స్ గుంభనంగా, గంభీరంగా ఉండాలన్న నిబంధన కొత్తగా వచ్చినది కాదు. అటువంటి నిబంధనవెనుక ఎంతో చరిత్రే ఉందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు.
ఫ్యాషన్ ప్రపంచంపై ఎవరి అభిప్రాయం వారిది. అయితే క్యాట్ వాక్ చేసేటప్పుడు మోడల్స్ ఎందుకు నవ్వకూడదు అన్న వాదన అప్పుడప్పుడు తెరపైకి వస్తుంటుంది. ఒక్కో వృత్తిలోనూ ఆ వృత్తికి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే ఫ్యాషన్ మోడల్స్ ప్రదర్శన సమయంలోనూ పాటించాల్సిన నిబంధనలు ఉన్నాయి. క్యాట్ వాక్ సమయంలో మోడల్స్ ముఖంలో కనీసం చిరునవ్వు కనిపించకూడదు అన్నది ఏళ్ళుగా కొనసాగుతున్న నిబంధన.
మోడల్స్ కథాంశంగా నిర్మించిన జూలాండర్ వంటి హాస్య కధా చిత్రాల్లో కూడా అదే నిబంధనను పాటించడం కనిపిస్తుంది. అయితే క్యాట్ వాక్ ను స్మైల్ ఫ్రీ జోన్ గా పరిగణంచడంపై వస్తున్న అనేక విమర్శలను మాత్రం ఫ్యాషన్ నిపుణులు తిప్పి కొడుతున్నారు. వేదికపై క్యాట్ వాక్ ముగిసిన తర్వాత... డిజైనర్ పరిచయ సమయంలో మాత్రమే మోడల్స్ నవ్వే అవకాశం ఉంది. ఇతర సందర్భాల్లో వారు ఎంత గంభీరంగా ఉంటే... వారు పరిచయం చేసే ఫ్యాషన్ కు అంతటి విలువ లభిస్తుందంటున్నారు కొందరు అనుభవజ్ఞులు.
క్యాట్ వాక్ సమయంలో మోడల్స్ నవ్వకూడదన్న నిబంధన వారసత్వంగా వస్తోంది. అందుకు ఎన్నో ఆసక్తికరమైన ఉదాహరణలు ఉన్నాయి. 19వ శతాబ్దం నాటి చిత్రలేఖనాలను చూస్తే అదే విషయం వెల్లడవుతుంది. 20వ శతాబ్దంలో కనిపించన ఫ్యాషన్ ఫొటోగ్రఫీని చూసినా మోడల్స్ హాటీ లుక్, వారు ధరించిన దుస్తులు వారి స్థితిని తెలిపేట్లుగానే ఉంటాయన్నది ఫ్యాషన్ నిపుణుడు హాస్ట్ పి హాస్ట్ ఉద్దేశ్యం. ముఖం గంభీరంగా, గర్వంగా కనిపించడం, ఇతరులను తిరస్కరించే విధంగా ఉన్నా... మోడల్స్ విషయంలో మాత్రం ఆ స్వభావం వారి స్వీయ నియంత్రణను తెలుపుతుందని చెప్తున్నారు. పూర్వ కాలంలో ఉన్నత కుటుంబీకుల్లో, రాచరికంలోని వ్యక్తుల ప్రవర్తనా విధానంపై ప్రత్యేక శిక్షణ ఉండేది. ముఖ్యంగా ఇది యూరోపియన్ ఉన్నత కుటుంబీకుల్లో కనిపించేది.
అయితే ఆధునిక ప్రపంచంలో గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఓ ప్రత్యేక సామర్థ్యంగా గుర్తిస్తున్నారు. గంభీరంగా ఉండటం మరింత ఆకట్టుకునేదిగా ఉంటుందని సిద్ధాంతకర్త ఇర్వింగ్ గోఫ్మాన్ అంటున్నారు. ఇటువంటి ప్రదర్శన వారి వారి స్థాయిని తెలుపుతుందని చెప్తున్నారు. యుద్ధ పైలెట్లలో, డైహార్డ్ వంటి సినిమా విలన్లను చూసినప్పుడు అదే లక్షణం కనిపిస్తుందని... అది వారి సామర్థ్యాన్నితెలుపుతుందని అంటున్నారు.
ముఖ్యంగా మనసు కన్నా శరీరం అధీనంలో ఉండటం ఎంతో అవసరమని, ఆసక్తిని కలిగిస్తుందని గోఫ్మాన్ చెప్తున్నారు. మోడల్స్ విషయంలో వారి గాంభీర్య స్వభావం వారి వ్యక్తిగత గౌరవాన్ని నిలబెట్టేదిగా ఉంటుందని... నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రాముఖ్యతను కోల్పోతారని చెప్తున్నారు. క్యాట్ వాక్ పై నవ్వడం, అసహనాన్ని వ్యక్తం చేయడం వల్ల ఆ ప్రభావం డిజైనర్ పై కూడ పడుతుందని... అందుకే మోడల్స్ వేదికపై నవ్వకూడదు అన్న నియమాన్ని శతాబ్దాలుగా కొనసాగిస్తున్నట్లు చెప్తున్నారు.