
మెలానియా ట్రంప్.. ఎందుకిలా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలైన మెలానియా ట్రంప్ వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశం సందర్భంగా తలపై వస్త్రం కప్పుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ అంశం అక్కడ చర్చనీయాంశమైంది. పోప్ ను కలిసే సందర్భంలో నల్లని రంగు దస్తులు ధరించడం ఆనవాయితీ. చేతులు పూర్తిగా కప్పిఉంచేలా డ్రెస్స్ ధరించిన మెలానియా, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ తలపై వస్త్రంతో కనిపించి వాటికన్ సంప్రదాయాన్ని పాటించారు.
ఇటీవల ట్రంప్ దంపతులు తమ తొలి విదేశీ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాకు వెళ్లగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధంగా నడుచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీలో ఆమె పర్యటించారు. మెలానియాతో పాటు ట్రంప్ కూతురు, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ సైతం తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడం తెలిసిందే. ఇస్లామిక్ సంప్రదాయ రాజ్యమైన సౌదీలో మహిళల పట్ల, మహిళల వస్త్రధారణ పట్ల పలు ఆంక్షలు ఉంటాయి. పర్యాటకులు, విదేశీయులకు మాత్రం ఈ ఆంక్షలపై సడలింపు ఉంటుంది.
సౌదీలో వారి సంప్రదాయం, పద్ధతులు పాటించని మెలానియా, పోప్ ఫ్రాన్సిస్ తో సమావేశం సందర్భంగా బాధ్యతగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 'వాటికన్ ప్రొటోకాల్ ప్రకారం ప్రథమ మహిళ లాంగ్ స్లీవ్స్ ధరించాలి. నల్లని రంగు దుస్తులు ధరించడంతో పాటు తలపై వస్త్రాన్ని కప్పుకుని హాజరవడం సంప్రదాయం. మరోవైపు సౌదీ పర్యటనలో ఆమె వస్త్రధారణ పలానా ఉండాలంటూ ఎలాంటి విజ్ఞప్తి రాలేదు. అందుచేత మెలానియా సౌదీ పర్యటనలో మామూలుగానే వ్యవహరించారని' మెలానియా వ్యక్తిగత అధికార ప్రతినిధి స్టెఫానీ గ్రిషమ్ వివరించారు.
2015 జనవరిలో అప్పటి ప్రథమ పౌరురాలు, బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు వెళ్లడాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తప్పుబట్టారు. ఇలా చేయడం సౌదీని అవమానించడమేనని, దీనివల్ల అమెరికాకు శత్రువులు మరింత పెరిగిపోతారని విమర్శిస్తూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.