కిస్ చేస్తూ ప్రియుడి నాలుకను కొరికేసింది!
హార్ట్ఫోర్డ్: గాఢమైన చుంబనంలో విచక్షణను కోల్పోయిన ఓ మహిళ ప్రియుడి నాలుకను కొరికేసింది. హఠాత్పరిణామంతో బిత్తరపోయిన ప్రియుడు తెగిపోయిన నాలుక ముక్కను చేతబట్టుకొని హుటాహుటిన ఆసుపత్రికి పరిగెత్తిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
అమెరికాలోని కనెక్టికట్లో హార్ట్ఫోర్డ్ సిటీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. షకియా లాంగ్(37) అనే మహిళ తన ప్రియుడు డ్వేన్ విలియమ్స్(41)తో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఇంట్లో మత్తు పదార్థాలను మోతాదుకు మించి తీసుకున్న అనంతరం విలియమ్స్ను కిస్ చేస్తూ.. షకియా లాంగ్ అతని నాలుకను కొరికేసింది. ఒక్కసారిగా నాలుక తెగిపోవడంతో బయటకు పరిగెత్తిన విలియమ్స్ అటుగా వెళ్తున్న పోలీసు సహాయంతో ఆసుపత్రికి చేరినట్లు స్థానిక పత్రిక వెల్లడించింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు షకియాపై కేసునమోదు చేశారు. తెగిపడిన నాలుకకు వైద్యులు అతికష్టం మీద అతికించారు. ఘటన జరిగిన సమయంలో చాలా రక్తం పోయిందని విలియమ్స్ పోలీసులకు తెలిపాడు. మార్చ్ 31న ఈ కేసుకు సంబంధించి షకియా కోర్టుకు హాజరుకానుంది. అయితే ఆసమయంలో విలియమ్స్ గాయపడిన సంగతే తనకు తెలియదని షకియా చెబుతుండటం విశేషం.