థాయ్‌ గుహ నుంచి అందరూ క్షేమంగా.. | Worldwide The Biggest Stories Of The Year 2018 | Sakshi
Sakshi News home page

శాంతి నుంచి సునామీ వరకు..

Published Thu, Dec 27 2018 2:20 AM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM

Worldwide The Biggest Stories Of The Year 2018 - Sakshi

కొరియాలో శాంతి గీతాలాపన, సౌదీ అరేబియాలో స్టీరింగ్‌ చేతపట్టి మహిళల స్వేచ్ఛాగానం, హాలీవుడ్‌ సినిమాను తలపించేలా థాయ్‌ గుహలో ఆపరేషన్, పాక్‌ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ కొత్త ఇన్నింగ్స్, తమకు తిరుగే లేదని నిరూపించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అంగరంగవైభవంగా ప్రిన్స్‌ హ్యారీ వివాహం, వీల్‌ చైర్‌ నుంచే విశ్వరహస్యాలపై ప్రయోగాలు చేసిన స్టీఫెన్‌ హాకింగ్‌ అస్తమయం, ఇండోనేసియాపై మరోసారి విరుచుకుపడిన సునామీ లాంటి మర్చిపోలేని ఘటనలను మిగిల్చింది 2018. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన కొన్ని ఘటనలను మరోసారి గుర్తుచేసుకుందాం..  

ట్రంప్, కిమ్‌ శిఖరాగ్ర సదస్సు
నా టేబుల్‌ మీద అణుబాంబుని పేల్చే మీట ఉందని ఒకరంటే నా టేబుల్‌పై అంతకంటే పెద్ద అణుబాంబు బటన్‌ ఉందంటూ మరొకరు మాటల తూటాలు పేలుస్తూ ప్రపంచ దేశాల గుండెల్లో  అణుబాంబుల్ని పేల్చారు. చివరికి ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్‌జాంగ్‌ ఉన్‌ జూన్‌లో సింగపూర్‌లో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలప్రదం అయ్యాయని నేతలిద్దరూ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కొరియాలో శాంతిస్థాపన దిశగా అడుగులు పడతాయన్న ఆశలు చిగురించాయి. 

విశ్వ శోధకుడు హాకింగ్‌ అస్తమయం
అరుదైన వ్యాధితో బాధపడుతూ వీల్‌చైర్‌కే పరిమితమైనా ఆత్మవిశ్వాసంతో విశ్వరహస్యాల్ని నిరంతం శోధించిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త  స్టీఫెన్‌ హాకింగ్స్‌ మార్చి 14న కన్నుమూశారు. ఏ క్షణంలోనైనా మృత్యుదేవత దరిచేరవచ్చని తెలిసినా స్టీఫెన్‌ విశ్వానికి సంబంధించి రోజుకో కొత్త విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. కృష్ణ బిలాలకు సంబంధించి ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసిన హాకింగ్‌ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి తరతరాలకి పదిలం. మనిషి భూమిని వదిలి కొత్త గ్రహాలకు వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ తాను అనంతలోకాలకు తరలిపోయారు.

పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌
క్రికెట్‌ మైదానంలో ఫాస్ట్‌ బౌలింగ్‌తో దూకుడు ప్రదర్శించిన ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్తాన్‌ ప్రధానిగా కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. ఆగస్టు 18న పాక్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయనకు ఈ విజయం అంత సులభంగా దక్కలేదు. కేవలం ఒక్క సీటుతో మొదలు పెట్టి 22 ఏళ్ల కృషితో తాను కన్న కలల్ని సాకారం చేసుకున్నారు ఇమ్రాన్‌. పాక సైన్యం చెప్పుచేతల్లో ఉంటారన్న ఆరోపణలు ఉన్న ఇమ్రాన్‌ ప్రధాని పీఠంపై కూర్చోగానే కశ్మీర్‌ విషయంలో భారత్‌ అడుగు ముందుకేస్తే తాము రెండడుగులు వేస్తామంటూ ప్రకటించి శాంతి మంత్రం ఆలాపించారు. 

నాలుగోసారీ.. పుతిన్‌
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రస్థానం 2018లోనూ అప్రతిహతంగా కొనసాగింది. ఈ ఏడాది మేలో ఆయన వరసగా నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. గత పద్దెనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయన మరో ఆరేళ్ల పాటు రష్యా పీఠంపై కొనసాగుతారు.

జిన్‌పింగ్‌.. శాశ్వత అధ్యక్షుడు
ఒక వ్యక్తి చైనా దేశ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు మాత్రమే పోటీ చేయాలన్న నిబంధనల్ని చైనా పార్లమెంటు తిరగరాసింది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శాశ్వతంగా దేశాధ్యక్షుడిగా కొనసాగడం కోసమే కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. దానికి చైనా పార్లమెంటు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఆమోద ముద్ర వేయడంతో జిన్‌పింగ్‌ శాశ్వత అధ్యక్షుడిగా మారారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో మావో జెడాంగ్‌ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడు జిన్‌ పింగ్‌. 

క్షమాపణలు చెప్పిన జుకర్‌బర్గ్‌
ఫేస్‌బుక్‌ డేటా లీకేజీ వ్యవహారంతో ఆ సంస్థ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ అమెరికా కాంగ్రెస్‌ విచారణ ఎదుర్కొన్నారు. సెనేటర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక జుకర్‌బర్గ్‌ సారీ చెప్పారు. ఫేస్‌బుక్‌ నుంచి సమాచారం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

సీనియర్‌ బుష్‌ కన్నుమూత 
వృద్దాప్యం కారణంగా 94ఏళ్ల వయసులో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌డబ్ల్యూ బుష్‌ నవంబర్‌ 30న కన్నుమూశారు. అమెరికాలో కీలక పరిణామాల సమయంలో ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. కువైట్‌ యుద్ధం ఆయన నేతృత్వంలోనే జరిగింది. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన సమయంలోనూ, ప్రచ్ఛన్న యుద్ధం చివరి రోజుల్లో బుష్‌ అధ్యక్ష పీఠంపై ఉన్నారు.

సౌదీలో డ్రైవింగ్‌ చేసిన మహిళలు
సౌదీ అరేబియాలో మహిళలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. స్టీరింగ్‌ చేతపట్టి ఆత్మవిశ్వాసంతో రయ్‌ రయ్‌మంటూ కార్లు నడిపే అవకాశాన్ని 2018 ఏడాది వారికి బహుమతిగా ఇచ్చింది. తరతరాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని సౌదీ ప్రభుత్వం జూన్‌ 24న ఎత్తివేసింది. దీంతో అర్ధరాత్రి అని కూడా చూడకుండా చాలా మంది సౌదీ మహిళలు రోడ్లపైకి వచ్చి కార్లలో షికారు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

థాయ్‌ గుహలో చిన్నారుల రెస్క్యూ 
అందరూ క్షేమంగా ఉన్నారు.. ఈ ఒక్క మాట ఈ ఏడాది కోట్లాది మందిని ఊపిరి పీల్చుకునేలా చేసింది. 12 మంది ఫుట్‌బాల్‌ యువ క్రీడాకారులు, వారి కోచ్‌ 18 రోజులు థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకుపోయిన ఘటన నరాలు తెగేలా ఉత్కంఠకు కారణమైంది. అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసి, వరద నీరు గుహ ద్వారాన్ని ముంచేసింది. గుహలోపల నిద్రాహారాలు లేకుండా బిక్కుబిక్కుమన్న చిన్నారుల క్షేమసమాచారాల కోసం ప్రపంచం యావత్తూ కోట్ల కళ్లతో ఎదురు చూసింది. గుహ నుంచి వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రపంచంలోని అసాధారణ నేవీ బృందాలు, థాయ్‌ నేవీ సీల్స్‌ చేసిన సాహసానికి ప్రపంచ దేశాలు సెల్యూట్‌ చేశాయి.  

జర్నలిస్టు ఖషోగ్గి హత్య
సౌదీలో ప్రముఖ జర్నలిస్టు, వాషింగ్టన్‌ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గి దారుణ హత్య ఈ ఏడాది సంచలనం సృష్టించింది. అక్టోబర్‌లో వ్యక్తిగత పనుల నిమిత్తం టర్కీలోని ఇస్తాంబుల్‌లో సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లాక ఆయన అదృశ్యమయ్యారు. సౌదీ ప్రభుత్వ ఏజెంట్లు ఆయనను హత్య చేసి శవాన్ని ముక్కలు చేసి రాయబార కార్యాలయంలోనే యాసిడ్‌లో కరిగించారని వార్తలు వచ్చాయి. ఖషోగ్గి అదృశ్యం, హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హస్తం ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి.

ఒక్కటైన ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కల్‌ 
ప్రపంచమంతా ఆ పెళ్లి కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూసింది. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ మనవడు ప్రిన్స్‌ హ్యారీ, అమెరికా నటి మేఘన్‌ మార్కల్‌ ఈ ఏడాది మే 19న ఒక్కటయ్యారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రాజవంశానికి హాలీవుడ్‌ గ్లామర్‌ జతకూరడంతో ఈ పెళ్లిపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. వీరిద్దరి వివాహానికి అంతర్జాతీయ మీడియా అత్యంత ప్రాధాన్యత కల్పించింది. 

శ్రీలంక సంక్షోభం
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఈ ఏడాది సెగలు పొగలు కక్కింది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన రాత్రికి రాత్రే ప్రధాని కుర్చీ నుంచి రణిల్‌ విక్రమసింఘేను దింపేసి మహిందా రాజపక్సను కూర్చోబెట్టారు. కానీ రాజపక్స రెండు సార్లు విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. దీంతో పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. కానీ పార్లమెంటును రద్దు చేయడం చెల్లదంటూ శ్రీలంక సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో సిరిసేనకు ఎదురుదెబ్బ తగిలింది. రాజపక్స రాజీనామా చేయడం, తిరిగి విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణం చేయడం వెంటవెంటనే జరిగాయి.

అమెరికా షట్‌డౌన్‌
అమెరికాలో ఈ ఏడాది మూడుసార్లు షట్‌డౌన్‌ జరిగింది. ట్రంప్‌ వలస విధానాలతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడానికి అమెరికా, మెక్సికో సరిహద్దు పొడవునా గోడ నిర్మాణం కోసం 500 కోట్ల డాలర్లు వెచ్చించాలంటూ ట్రంప్‌ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్‌ ఆమోదించకపోవడం తాజాగా డిసెంబర్‌లో పాలన స్తంభించింది. జనవరి, జూన్‌ నెలల్లోనూ కొన్నాళ్లు షట్‌డౌన్‌ జరిగింది. ఒకే ఏడాదిలో మూడు సార్లు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడమనేది గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి.

ఇండోనేసియాపై విరుచుకుపడిన సునామీ
2018 వెళ్లిపోతూ వెళ్లిపోతూ తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇండోనేసియాపై సునామీ మరోసారి విరుచుకుపడింది. ఆనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం భారీ స్థాయిలో బద్దలై పర్వతంలోని ఒక భాగం సముద్రంలో కుప్పకూలింది. దీంతో భారీ అలల మొదలై సునామీగా మారి జావా, సుమత్రా తీర ప్రాంతంలో ఊళ్లను ముంచెత్తింది. ఈ ప్రకృతి విలయంలో దాదాపుగా 500 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.  
 

బ్రెగ్జిట్‌.. థెరిసాకి సవాల్‌
యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడానికి సంబంధించిన ఒప్పందం(బ్రెగ్జిట్‌ డీల్‌)పై సంక్షోభం నెలకొంది. బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరిసా మే ఒకే చేసిన ముసాయిదా ఒప్పందంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత నెలకొంది. ప్రస్తుతం ఉన్నట్టుగా ఆ ఒప్పందం పార్లమెంటులో ప్రవేశపెడితే ఆమోదం పొందడం కష్టమేనన్న అనుమానాలు మొదలయ్యాయి. అందుకే బ్రెగ్జిట్‌ ఒప్పందానికి మార్పులు చేర్పులు చేసి పార్లమెంటుకు సమర్పించే యోచనలో థెరిసా ఉన్నారు. కొత్త సంవత్సరంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

సిరియాపై అమెరికా వార్‌
గత ఏడేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాపై అమెరికా నేరుగా యుద్ధాన్ని ప్రకటించింది. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ఆధీనంలోని సైనిక స్థావరాలపై క్షిపణి దాడులకు దిగింది. అసద్‌ గద్దె దిగితేనే సిరియాలో శాంతిస్థాపనకు ఆస్కారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ దాడుల్లో చిన్నారులు మరణించిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. 

జీరో టాలరెన్స్‌ 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుసరించిన జోరో టాలరెన్స్‌ వలస విధానం వివాదాస్పదంగా మారింది. సరిహద్దుల్లో శరణార్థుల పడిగాపులు, తల్లీ బిడ్డల్ని వేరు చేసిన దృశ్యాలు మనసుల్ని పిండేశాయి. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి వచ్చారని 2000 మంది పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి హోమ్స్‌కి తరలించారు. చివరికి ట్రంప్‌ సర్కార్‌పై ఒత్తిడి పెరగడంతో తల్లీ బిడ్డల్ని వేరు చేయొద్దంటూ ఉత్తర్వులిచ్చారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement