
ఐదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వారం రోజులపాటు సాగే ఈ కీలక సమావేశాల్లో ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కే మరోసారి చైనా పగ్గాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన ఎన్నిక దాదాపు ఖరారు కాగా జిన్‌పింగ్‌ను అధికారికంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోనున్నారు. చైనాలో సీపీసీ ప్రధాన కార్యదర్శే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
అన్నిటి కంటే ముఖ్యంగా ఈ సమావేశాల్లో తన పట్టు నిలుపుకుంటూ జిన్‌పింగ్ బలమైన నేతగా అవతరిస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. అలాగే కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగానికి కూడా సవరణలు చేసే అవకాశముంది. 19వ కాంగ్రెస్ సమావేశాల్లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటామని, సమావేశాలు ముగిశాక.. పొలిట్ బ్యూరోకు చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడతారని సీపీసీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
నిజానికి చైనాలో కీలక అధికారాలు ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ చేతుల్లోనే ఉంటాయి. ఆ కమిటీకి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న జిన్‌పింగ్ (64) దేశాధ్యక్షుడిగానే కాకుండా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సైనికాధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు. మిగతా ఆరుగురిలో ప్రధాని లీ కెకియాంగ్ తదితరులు ఉన్నారు. 2002 పార్టీ సమావేశాల్లో చేసిన ఒప్పందం మేరకు అగ్రనేతలైన అధ్యక్షుడు, ప్రధాని రెండోసారి కమిటీలో కొనసాగనున్నారు.
వారిద్దరినీ మినహాయిస్తే కమిటీలోని మిగిలిన ఐదుగురు సభ్యుల మార్పు దాదాపు ఖాయమైంది. ఈసారి అందరి దృష్టి జిన్‌పింగ్ విధేయుడు వాంగ్ క్యిషన్(69)పైనే ఉంది. ఇటీవల చైనా అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించడంతో ఆయనకు స్టాండింగ్ కమిటీలో స్థానం కల్పిస్తారనే ప్రచారం సాగింది. అయితే పార్టీ రాజ్యాంగం ప్రకారం పదవీ విరమణ వయసు 68 కావడంతో ఆయన ఎన్నికపై సందిగ్ధం నెలకొంది. బీజింగ్‌లోని గ్రేట్ హాల్లో జరిగే కాంగ్రెస్ సమావేశానికి దేశం నలుమూలల నుంచి పార్టీకి చెందిన 2,307 మంది ప్రతినిధులు హాజరవుతారు.
70 శాతం పదవులు జిన్‌పింగ్ అనుయాయులకే!
చైనా అన్ని విధాలా అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది జిన్‌పింగ్ హయాంలోనే. ఇప్పుడు రెండోసారి సీపీసీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాక ఆయన అధికార కేంద్రీకరణ చేస్తారనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సమావేశాల్లో 70 శాతం పదవులను తన అనుయాయులకే కట్టబెట్టడంతో, తన అధికారాన్ని పటిష్టం చేసేలా రాజ్యాంగాన్ని సవరిస్తారని అంచనావేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు, నేతల అవినీతిపై జిన్‌పింగ్ కఠిన చర్యలు తీసుకున్నారు.
చైనా కార్మికుల జీతాలు బాగా పెంచారు. అదే సమయంలో చైనా వృద్ధి రేటు మందగించినా.. సీపీసీ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వ విధానాలకే ప్రాధాన్యమిచ్చారు. సీపీసీలో, ప్రభుత్వంలో పూర్తి పట్టు సాధించి తన అనుయాయులకు పదోన్నతులు కల్పించారు. అవినీతి కమ్యూనిస్టు నేతల్ని ఇంటికి సాగనంపారు. అయితే గతేడాది తనను కోర్ లీడర్‌గా ప్రకటించకున్నప్పటి నుంచీ జిన్‌పింగ్ వ్యక్తి పూజను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment