సార్వత్రిక వైద్య బీమా కల్పించినప్పుడే దేశ ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు వరంలాగా మారిందని అమెరికాలో ప్రైమ్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ సంస్థాపకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి చెబుతున్నారు. స్నేహానికి ప్రాణం పెట్టే వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో దేశంలోనే ఒక ట్రెండ్ సృష్టిం చారని, పేద ప్రజలకు సాయం చేయాలన్న వైఎస్‌ఆర్ ఆలోచనలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటున్నాయని చెబుతున్న ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
అమెరికా దాకా మీ జీవిత పయనం ఎలా సాగింది?
పల్లెటూళ్లో పుట్టాను. లాంతరు వెలుగులో చదువుకున్నాను. మా వంశంలో నేనే మొదటిసారిగా హైస్కూలుకి వెళ్లాను. తర్వాత తిరుపతికి వెళ్లి చదువుకుని అక్కడినుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు వచ్చాను. అమెరికాలో కార్డియాలజీ చాలా అభివృద్ధి చెందింది. నా భార్య కూడా డాక్టర్. 1976లో అమెరికా వచ్చి కార్డియాలజీ ప్రాక్టీస్ చేశాము. మొదట్లో కార్డియాలజీ పేషెంట్లకు సేవలందించడానికి తగిన స్థలం ఉండేది కాదు. దాంతో కాలిఫోర్నియాలో సొంతంగా ఆసుపత్రి కట్టించాను. ఇండియాలోలాగా ఒక డాక్టర్ సొంతంగా ఆసుపత్రి నిర్మించడం చాలా కష్టం. తర్వాత అనేక ఆసుపత్రులు నిర్మించాను. ముఖ్యంగా విఫలమైన ఆసుపత్రులను తీసుకుని వాటిలో పెట్టుబడి పెట్టి మంచి డాక్టర్లను నియమించి వృద్ధి చేశాను. ప్రస్తుతం అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 45 ఆసుపత్రులను నిర్వహిస్తున్నాను.
మీ సిబ్బంది ఎందరికి వైద్య సేవలు అందిస్తున్నారు?
అమెరికాలోని మా ఆసుపత్రుల్లో 45 వేల మంది సిబ్బంది ఉంటున్నారు. డాక్టర్లయితే మా ఆసుపత్రుల్లో ఒక్కో దానిలో కనీసం 400 మంది ఉంటారు. వీరిలో పూర్తిగా ఆసుపత్రికే అంకితమై ఉండే వైద్యులు వందమంది ఉంటారు. అంటే మా 45 ఆసుపత్రుల్లోనూ కనీసం 5,000 మంది పూర్తి కాలం డాక్టర్లు పనిచేస్తున్నారు. నా వృత్తిపట్ల నా అంకితభావమే ఈ విజయానికి కారణం. డాక్టర్ మా గుండెలోకి బెలూన్ పంపి, గుండెను తెరిచి దాని లోపాన్ని నయం చేసి మమ్మల్ని బతికించాడనే కృతజ్ఞతను రోగులు మాకు చెబుతున్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది.
భారతీయ వైద్యరంగం మెరుగుదలకు ఏం చేయాలి?
ఇక్కడ కూడా వైద్య బీమా వ్యవస్థ రావాలి. దివంగత సీఎం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఇది దేశవ్యాప్తంగానే ట్రెండ్‌ని సృష్టించిన మంచి కార్యం. ప్రభుత్వం నుంచి జరిగే ఇలాంటి కార్యక్రమాలే కాకుండా చిన్నా పెద్ద కంపెనీలు సైతం తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు, సిబ్బం దికి, కార్మికులకు ఇలాంటి ఆరోగ్యబీమా పథకాలను అందిస్తే చాలామందికి సహాయ కారిగా ఉంటుంది.
మీరు ఇండియాలో కార్యక్రమాలు చేస్తుంటారా?
అప్పుడప్పుడూ మాత్రమే ఇండియాకు వస్తుంటాను. ఛారిటీ పనులు చేస్తుంటాను. మా ఊర్లో హైస్కూలు, వాటర్ ప్లాంట్‌లు కట్టించాను. కాంక్రీట్ రోడ్లు వేయిం చాను. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో మరో 50 ఊర్లలో మంచి నీటి బావులు తవ్వించాను. వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటుచేసి, ఎవరైనా 50 శాతం నిధులు అందిస్తే మరో 50 శాతం నిధులు నేను వేసుకుని వాటర్ ప్లాంట్‌లు పెట్టిస్తానని చెప్పాను.
వైఎస్సార్‌తో మీ అనుబంధం?
ఒక సంవత్సరం పాటు ఆయనతో కలిసి తిరుపతిలో పనిచేశాను. ఆయన హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు నేను కాలేజీలో ఉండేవాడిని. అప్పటినుంచి చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. చాలాకాలంగా ప్రతిపక్షంలో ఉండి తర్వాత సీఎం అయ్యారు. జాతీయ నాయకుడు అయ్యారు. ఎంతమందికి తాను సహాయం చేయగలను అనే ఆయన ఆలోచన శాశ్వతంగా అలా ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఆయన దార్శనికత చాలా గొప్పది. ఆరోగ్య శ్రీని తీసుకురావడం, రైతుల కష్టాలను ఆదుకోవడం, జలయజ్ఞాలు వంటివి చాలా మంచిపనులు.
వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రపై మీ అభిప్రాయం?
ఆరోగ్యపరంగా చాలా హెల్తీగా ఉంటాడు. అంతమంది మనుషులను చూసి, వారితో మాట్లాడిన తర్వాత తనకు విషయాలు లోతుగా అర్థమవుతున్నాయనిపిస్తోంది. ప్రజల కోరికలు, వారి కష్టాలు, వారేం ఆశిస్తున్నారు అనే పరిశీలన ఆయనను మంచి రాజకీయనేతగా మారుస్తోందనుకుంటున్నాను.
అమెరికాలో ఉండి తెలుగు రాష్ట్రాల గురించి తెలుసుకుంటూంటారా?
ఇక్కడి విషయాలు అన్నీ తెలియవు. వచ్చే పోయే స్నేహితులు, పరిచయస్తులు చాలావరకు చెబుతుం టారు. ఏం జరుగుతోంది అనేది అర్థమవుతుం టుంది. రెండు రాష్ట్రాలుగా విడిపోవడం కొందరికి మంచిదేమో నాకు తెలీదు కానీ కలిసుంటే బాగుం డేది అని సాధారణంగా అనుకుంటూ ఉంటాం కదా. అందరూ తెలుగోళ్లే కదా మనకు రెండుగా విభజన ఎందుకు అనుకునేవాడిని.
తెలుగు రాష్ట్రాల్లో పాలనపై మీ అభిప్రాయం?
అంత పూర్తిగా తెలీదండి. కానీ తెలంగాణలో పాలన బాగా జరుగుతోందని, ఏపీలో రాజకీయాలు ఎక్కువగా జరుగుతుంటాయని వింటుంటాను. రాజకీయ పార్టీల మధ్య నిత్య ఘర్షణ ఉంటే అభివృద్ధి జరగదని నేననుకుంటాను. ఘర్షణతోనే కాలం గడిచిపోతుంటే వనరులు, శక్తి అన్నీ దానికే ఖర్చయిపోతాయి. అలా కాకుండా ఉన్న వనరులను పైకి తీసుకుపోయేటట్టు పనిచేస్తే బాగుంటుంది.
స్నేహం ఏర్పడితే వైఎస్‌ఆర్ జీవితాంతం దాన్ని నిలబెట్టుకుంటారంటారు, మరి మీ విషయం?
మీరన్నది నూటికి నూరుపాళ్లూ కరెక్ట్. మామధ్య ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు రాలేదు. స్నేహభావంతో పరస్పరం గౌరవించుకునేవాళ్లం. మామధ్య ఎప్పుడూ మనస్ప ర్థలు రాలేదు.
వైఎస్ జగన్ ఈసారి సీఎం అవుతారని అనుకుంటున్నారా?
నా స్నేహితుడి కుమారుడాయన. ఆయనకు మంచే జరగాలని కోరుకుంటాను. కానీ రాజకీయాలు ఎలా తిరుగుతాయో నాకు తెలీదు కదా. ఒకసారేమో వారు గెలుస్తారంటారు. మరోసారేమో వీరు గెలుస్తారంటారు. కానీ అధికారం వైఎస్ జగన్‌కు వస్తే ప్రజలకు మంచే జరుగుతుందనుకుంటాను.
యువతకు మీరిచ్చే సందేశం?
లక్ష్యం లేకుండా గడిపేయవద్దు. ముఖ్యంగా చదువు విషయంలో. సరైన కాలేజీలను ఎంపిక చేసుకుని చదవడం అవసరం. విజ్ఞానం, అంకితభావం, కష్టపడి పనిచేయడం ఇవే ఎవరైనా నేర్చుకోవాలి. అమెరికాలో తెలుగు డాక్టర్లు, ఐటీ నిపుణులు చాలా సక్సెస్ పొందుతున్నారు. అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారు. కష్టపడి పైకి రావడం అంటే ఇదే. అందరికీ అభినందనలు.
(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://bit.ly/2v3SquC
https://bit.ly/2AtX3Do
Published Wed, Aug 1 2018 1:17 AM | Last Updated on Wed, Aug 1 2018 1:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment