ఓటర్ల సవరణకు పరిశీలకులు | voter list verification and changes | Sakshi
Sakshi News home page

ఓటర్ల సవరణకు పరిశీలకులు

Published Sat, Feb 3 2018 6:52 PM | Last Updated on Sat, Feb 3 2018 6:56 PM

voter list verification and changes - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ : ఎన్నికల సంఘం ఓటర్ల సవరణకు ఆదేశాలు జారీ చేసింది. బూత్‌స్థాయిల వారీగా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదు అవకాశం కల్పించింది. ఈ ఓటర్ల జాబితా తదితర ప్రక్రియను పరిశీలించేందుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ఐఏఎస్‌ అధికారి ఎం.జగదీశ్వర్‌ను నియమించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు, సవరణ కోసం క్యాంపెయిన్‌లు నిర్వహించనున్నారు. బూత్‌స్థాయిలో ఈనెల 4, 11 తేదీల్లో బూత్‌స్థాయి అధికారి (బీఎల్‌వో) ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటర్ల మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన ఓటర్లందరూ ఈనెల 14 వరకు తమ దరఖాస్తులు సమర్పిస్తే పరిశీలించి, అంతిమ ఓటర్ల జాబితా 24న ప్రచురిస్తారు.

అధికారులతో ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనూప్‌సింగ్‌ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. అన్ని జిల్లాలకు ఎలక్ట్రోరల్‌ ఆబ్జర్వర్లను నియమించినట్లు పేర్కొన్న ఆయన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారి, మహిళా, శిశు, వికలాంగులశాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. ఎలక్ట్రోరల్‌ ఆబ్జర్వర్లు జిల్లాలకు వచ్చినప్పుడు గుర్తింపు పొందిన పొలిటికల్‌ పార్టీల ప్రతినిధులు, ఓటరు నమోదు అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. రికార్డులు అన్ని సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎలక్ట్రోరల్‌ ఆబ్జర్వర్లకు లైజన్‌ ఆఫీసర్‌ను నియమించుకుని అట్టి వివరాలను సమర్పించాలని తెలిపారు.  వీడియో కాన్పరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ బద్రి శ్రీనివాస్, డీఆర్‌వో అయేషామస్రత్‌ ఖానమ్, జిల్లా పరిషత్‌ సీఈవో పద్మావతి, కరీంనగర్, హుజూరాబాద్‌ ఆర్డీవోలు బి.రాజాగౌడ్, చెన్నయ్య, ఆసెంబ్లీ నియోజక వర్గ సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దార్లు, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపెన్‌ తేదీలు : కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌
హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా సవరణలో నమోదు మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు తొలగింపు ప్రక్రియకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 14వరకు అవకాశముందని, ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపైన్‌ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అంతిమ ఓటర్ల జాబితా మార్చి 24న ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement