
శివాజీనగర (బెంగళూరు): ఏదైనా విషయంపై అభిప్రాయం చెప్పడం కూడా తప్పేనా? అని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని చెప్పారు. అయితే ట్రాల్ పేరుతో ఈ హక్కును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, దీనికి సంబంధించి మైసూరు ఎంపీ ప్రతాప్ సింహకు కోర్టు నోటీసులు పంపించినట్లు తెలిపారు. సమాధానం ఇవ్వకపోతే క్రిమినల్ కేసు వేస్తానని హెచ్చరించారు.
కాగా, ‘ట్రాల్ గూండాయిజం’పై ‘జస్ట్ ఆస్క్’ అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఒక వ్యవస్థ గురించి మాట్లాడితే.. మీ ముక్కు కత్తిరిస్తామంటూ ట్రాల్ చేసి చంకలు గుద్దుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతాప్ సింహ వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయ నాయకులు దేశానికి అవసరమా అని ప్రశ్నించారు.