
మైసూరు: పత్రికా సంపాదకురాలు గౌరి లంకేశ్ హత్య విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ప్రతాప్ సింహ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హిందూ సంఘాలకు చెందిన 12మంది కార్యకర్తలు హత్యకు గురైనప్పుడు ప్రకాశ్‌రాజ్ ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో భ్రష్టుపట్టిన న్యాయవ్యవస్థ కారణంగానే గౌరీ లంకేశ్ హత్య జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి ప్రధాని నరేంద్రమోదీని విమర్శించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటకపై ప్రకాశ్‌రాజ్‌కు అంత ప్రేమ ఉంటే కావేరి నదీ జలాల పంపిణీ వివాదంపై ఎందుకు స్పందించలేదన్నారు. తమిళనాడులో ప్రకాశ్‌రాజ్‌గా కర్ణాటకలో ప్రకాశ్‌రైగా చలామణి అవుతున్న ఆయనకు ప్రధానిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు, విమర్శలు చేస్తే అదే వేదికపైకి వచ్చి ఆయనకు అన్ని విషయాలు వివరించాల్సి వస్తుందని హెచ్చరించారు.