పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం ఇకపై నెలల కొద్దీ తిరగాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చొనే తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌలభ్యం త్వరలోనే రాబోతోంది. జనన, మరణాలను తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనేక కేసుల్లో న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. దీని వల్ల భవిష్యత్తులో ప్రయోజనాలుంటాయి. తాజా విధానంతో ఎంతో సమయం, శ్రమ ఆదా అవుతాయి.
సాక్షి, బెంగళూరు: సాధారణంగా వివాహన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో మొదట వధువు, వరుడు ఇద్దరూ కచ్చితంగా రిజిస్ట్రేన్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అటుపై నెల పాటు నోటీసు అవధి ఉంటుంది. ఈ సమయంలో ఇరువైపుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేక పోతే అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విద్యార్హత, వయస్సు తదితర ధ్రువీకరణ పత్రాల కోసం ఎక్కువసార్లు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మొదట రాజధానిలో అమలు ఈ విషయమై రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌లోని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘నూతన విధానంలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. అందువల్లే ఈ విధాన్ని మొదట బెంగళూరులో అమలు చేసి అటుపై ఫలితాలను అనుసరించి రాష్ట్రమంతటా విస్తరింపజేస్తాం.’ అని పేర్కొన్నారు.
ఇది చాలు
= వధూవరులు నేరుగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
= ఆన్‌లైన్‌లోనే సంబంధిత దరఖాస్తును పూర్తి చేసి విద్య, వయస్సు, మత, కుల తదితర ధ్రువీకరణ పత్రాలను స్కాన్ చేసి పంపాలి.
= వధువరుల ఫోటోలతో పాటు వారిరువురూ సమ్మతిస్తున్నట్లు సెల్ఫ్ డిక్లరేషన్‌తో పాటు చిన్నపాటి వీడియోను కూడా అప్‌లోడ్ చేయాలి.
= కొద్దిరోజులకు రిజిస్ట్రేషన్ శాఖ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని అన్‌లైన్‌తో పాటు తపాలా ద్వారా కూడా పంపిస్తాయి.
ఇబ్బందులు లేకపోలేదు
నూతన విధానంలో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. కొన్ని సార్లు ఆన్‌లైన్‌లో బలవంతంగా ఆడియో, విడియోను రికార్డు చేసి అప్‌లోడ్ చేయించవచ్చు. నూతన విధానంలో వెయిటింగ్ అవధి లేదు. ఎన్ని రోజుల్లో ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్న విషయం ప్రస్తావించలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.