
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభంకానున్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో 2.15 లక్షల మందికి పైగా పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో భయం, ఆందోళన ఉండటం సహజం. అలాంటి వారు చదివిన ప్రశ్నలకు సైతం సమాధానాలు రాయలేని స్థితిలో ఉంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. సరైన రీతిలో ప్రిపేర్ అవడం ఎంత ముఖ్యమో, మనకు తెలిసిన దానిని రాయడం కూడా అంతే ముఖ్యం. చదువుతో పాటు పోషక విలువల కలిగిన ఆహారం తీసుకుంటే పరీక్షలను దిగ్విజయంగా రాయవచ్చని నిపుణులు అంటున్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే విజయం సొంతమవుతుందని స్పష్టం చేస్తున్నారు. వివరాలతో ప్రత్యేక కథనం...
♦ పరీక్షలు రాస్తున్నప్పుడు, దగ్గర పడుతున్న సమయంలో కొత్త అంశాల జోలికి వెళ్లకుండా గతంలో చదివిన ప్రశ్నలనే మరలా రివిజన్ చేసుకోవాలి. కొత్త టాఫిక్‌ను చదవడం సరికాదు. అలా చేయడం వల్ల విద్యార్థుల్లో టెన్షన్ క్రియేట్ అవుతుంది. ప్రిపేర్ కాలేదనే భయంతో ముందు చదివిన ప్రశ్నలకు సైతం సమాధానాలు రాయలేకపోతారు. పరీక్ష సమయం దగ్గర పడుతున్న కొద్దీ గతంలో ప్రిపేర్ అయిన వాటిని లాస్ట్‌మినిట్‌లో మరలా చూసుకోవడం వల్ల ప్రయోజనం అంతగా ఉండదు.
♦ పరీక్షలు దగ్గరపడుతుండటంతో విద్యార్థులు ఇతర కార్యకలాపాలను పక్కన పెట్టి చదువుపైనే దృష్టి సారించాలి. చదువుకునేందుకు ఏకాగ్రత ఎంతో అవసరం. ఆ సమయంలో ఇంట్లో బంధువులు, ఇతరులు ఉండటం వల్ల వారి చదువుకి ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది.
♦ విద్యార్థులు చదువుకునే విషయంలో తల్లిదండ్రులు చాలా కీలకంగా వ్యవహరించాలి. వారిని ఇతరులతో పోలుస్తూ సరిగ్గా చదవడం లేదనడం, గత పరీక్షల్లో సరిగ్గా మార్కులు రాలేదని పదే పదే అంటూ పేరెంట్స్ ఒత్తిడి చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. దీని వల్ల పిల్లలు చదువుపై దృష్టి సారించలేరు. ఒక్కో సమయంలో వారికి హెల్ప్ చేద్దామనుకుని భావించి మరింత ఒత్తిడికి గురిజేస్తుంటారు.
♦ పరీక్షల సమయంలో రోజుకి 5 నుంచి 10 నిమిషాల పాటు టీవీ చూడటం వల్ల రిలాక్స్ అవ్వచ్చు. అంతేకానీ అసలు టీవీ పెట్టవద్దంటూ విద్యార్థులను ఇబ్బంది పెట్టడం
సరైన చర్య కాదు.