సాక్షి, ఆత్మకూరు: తాను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా గత ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు దివంగత మహానేత వైఎస్‌ఆర్‌పై అభిమానంతో బుడ్డా రాజశేఖరరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారని, అయితే అమూల్యమైన ప్రజాభిమానాన్ని ఆయన డబ్బులకు అమ్ముకోవడం సిగ్గుచేటని వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్ధాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. విలువల కోసం తాను ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదిలేశానని, బుడ్డా రాజశేఖరరెడ్డి మాత్రం డబ్బుల కోసం పార్టీని వీడారన్నారు.
మహానేత వైఎస్‌ఆర్ శంకుస్థాపన చేసి, నిధులు విడుదల చేసిన సిద్ధాపురం ఎత్తి పోతల పథకం ఆయన హయాంలోనే 80 శాతం పూర్తి అయిందన్నారు. మిగిలిన పనుల్లోనూ చాలావరకు తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విడుదల చేసిన నిధులతో పూర్తి చేయించామన్నారు. కానీ బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాత్రం సిద్దాపురం గురించి ఆయన తండ్రి కల గన్నాడని, తాను పూర్తి చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఎన్టీఆర్ స్మృతివనం పేరిట ఒక పార్క్‌ను ఏర్పాటు చేస్తూ అందులో తన తండ్రి విగ్రహాన్ని పెట్టాలని అనుకుంటున్న ఎమ్మెల్యే ఎక్కడా స్థలం లేనట్లు ఎస్‌ఎన్ తండా గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నం చేశారని, వారు ప్రతిఘటించడంతోనే సిద్ధాపురం రైతుల భూములను లాక్కునే యత్నం చేస్తున్నారన్నారు.
ప్రాజెక్ట్‌కు తండ్రి పేరు మాత్రమే పెట్టించుకున్న బుడ్డా.. స్థానికులకు పిసరంత సాయం కూడా చేయలేకపోయారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, కుందూరు శివారెడ్డి, చిట్యాల వెంకటరెడ్డి యన్నం చంద్రారెడ్డి, బి.రామచంద్రారెడ్డి, ఎలీషా, లక్ష్మిరెడ్డి, రాజమోహన్ రెడ్డి, అంజాద్ అలి, విష్ణు వర్ధన్ రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment