62 మంది దర్శకుల అరుదైన నిర్ణయం
చెన్నై: తమిళనాడు చిత్ర దర్శకుల సంఘం అరుదైన నిర్ణయం తీసుకుంది. పరిశోధనల కోసం తమ మరణానంతరం శరీరాలను దానం చేయాలని 62 మంది దర్శకులు, మరో ఇద్దరు వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలసి అంగీకార పత్రాలను అందజేశారు. దర్శకుల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని జయలలిత అభినందించారు. సీఎంను కలిసిన వారిలో తమిళనాడు చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్తో పాటు కేఎస్ రవికుమార్, వాసు, ఆర్కే సెల్వమణి తదితరులు ఉన్నారు.
పరిశోధన కోసం శరీరాన్ని దానం చేయాలని దర్శకుల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశంలో తాను వెల్లడించగా, అందరూ సానుకూలంగా స్పందించారని విక్రమన్ చెప్పారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ను స్ఫూర్తిగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కమల్ హాసన్ కూడా తన శరీరాన్ని పరిశోధనల కోసం ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. మరణానంతర శరీరాలను దానం చేసే విషయంపై దర్శకుల సంఘం జిల్లాల్లో ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని విక్రమన్ చెప్పారు.