ఏ ఫర్...? | Aamir Khan to team up with Ghajini director A R Murugadoss again? | Sakshi
Sakshi News home page

ఏ ఫర్...?

Published Thu, Sep 1 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

ఏ ఫర్...?

ఏ ఫర్...?

ఆమిర్ ఖాన్, ఏఆర్ మురుగదాస్, ఏఆర్ రహమాన్, అసిన్.. ఈ నాలుగు పేర్లూ ఇంగ్లిష్‌లో ‘ఏ’ అక్షరంతో మొదలవుతాయ్. అందుకే ఈ కాంబినేషన్‌లో రూపొందిన హిందీ చిత్రం ‘గజిని’ విడుదలైనప్పుడు ‘నాలుగు ఏల కోసం ఈ సినిమా చూడొచ్చు. అద్భుతం’ అని చాలామంది అన్నారు. ఆమిర్‌ఖాన్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ఇది. ఇంతటి ఘనవిజయాన్ని ఇచ్చాడు కాబట్టే, దర్శకుడు మురుగదాస్ అంటే ఆయనకు అభిమానం. ఈ చిత్రం విడుదలై ఎనిమిదేళ్లయింది. మళ్లీ ఈ హిట్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు? అనుకునేవాళ్లకు మురుగదాస్ ఓ క్లారిఫికేషన్ ఇచ్చారు. ‘‘ఇటీవల ఆమిర్‌ని కలిశాను. ‘మన కాంబినేషన్‌లో సినిమా వచ్చి, చాలా ఏళ్లయింది. మళ్లీ చేద్దాం’ అన్నాను. ఆయన అంగీకరించారు.
 
 ప్రస్తుతం దక్షిణాది చిత్రాలతో నేను బిజీ. హిందీ చిత్రాలతో ఆయన బిజీ. అందుకని ఇప్పటికిప్పుడు మా కాంబినేషన్‌లో సినిమాని మొదలుపెట్టలేం. కొంత టైమ్ పడుతుంది. ఎంత టైమ్ అయినా చేయడం మాత్రం ఖాయం’’ అని మురుగదాస్ పేర్కొన్నారు. ఆమిర్ నటించిన తాజా చిత్రం ‘దంగల్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన అన్నారు. ఇటీవల విడుదలైన ‘దంగల్’ లుక్ చూసినప్పుడు ‘గజిని’, ‘ధూమ్ 3’లో కనిపించినంత యంగ్‌గా ఆమిర్ కనిపిస్తున్నారనిపించిందనీ, ఫిజిక్‌ని అద్భుతంగా మెయిన్‌టైన్ చేస్తున్నారని అన్నారు.
 
 ఆ సంగతలా ఉంచితే.. మళ్లీ ఆమిర్, మురుగదాస్ సినిమా చేస్తే, ఏఆర్ రహమాన్‌ని సంగీతదర్శకుడిగా అడిగితే కాదనరు. ఆ విధంగా ఈ మూడు ‘ఏ’లు మళ్లీ కలిసి సినిమా చేసే అవకాశం ఉంది. కానీ, ‘గజిని’లో నాయికగా నటించిన అసిన్‌కి పెళ్లయింది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలేవీ ఒప్పుకోలేదు. సో.. ఈ  ప్రాజెక్ట్‌కి ఆ ఒక్క ‘ఏ’ మిస్సవుతుందా? ఒకవేళ ఆలియా భట్‌ని నాయికగా తీసుకున్నా లేక ‘ఏ’ అక్షరంతో మొదలయ్యే పేరున్న వేరొక తారని తీసుకున్నా అప్పుడు ఈ సినిమాకీ నాలుగో ‘ఏ’ ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement