అందరూ ‘ఆచారి... ఆచారి’ అంటున్నారు. అసలు, ఆచారిగారు ఎలా ఉంటారేంటి? అనడిగితే... ‘పన్నెండు రోజులు ఆగండి. ఆచారిని అందరి ముందుకు తీసుకొస్తాం’ అంటున్నారు దర్శక–నిర్మాతలు. మంచు విష్ణు హీరోగా ఎం.ఎల్. కుమార్‌చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు నిర్మిస్తున్న సిన్మా ‘ఆచారి అమెరికా యాత్ర’. కథానాయికగా ప్రగ్యా జైస్వాల్, కీలక పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు.
ఈ (నవంబర్) 23న మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘విష్ణు, నాగేశ్వరరెడ్డి కలయికలో ‘దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం’ వంటి హిట్స్ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ‘ఆచారి అమెరికా యాత్ర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టు సినిమా రూపొందుతోంది. హైదరాబాద్, అమెరికా, మలేసియాలలో పలు సన్నివేశాలు, పాటలు చిత్రీకరించాం.
ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. విష్ణు పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. పాటల్ని, ప్రచార చిత్రాల్ని ఎప్పుడు విడుదల చేసేది త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. కోట శ్రీనివాసరావు, పోసాని, పృథ్వీ, ప్రవీణ్, విద్యుల్లేఖా రామన్, ‘ప్రభాస్’ శీను, ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్ సింగ్, సుప్రీత్, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచయిత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి, కెమెరా: సిద్ధార్థ, కూర్పు: శేఖర్, సంగీతం: ఎస్.ఎస్. తమన్, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, కళ: కిరణ్, యాక్షన్: సెల్వ.
Comments
Please login to add a commentAdd a comment