
ఆచారి టూరు.. భలే జోరు
హీరో మంచు విష్ణు–దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం’ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఈ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూడో సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ఢీ, దేనికైనా రెడీ చిత్రాల తర్వాత విష్ణు–బ్రహ్మానందం ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులకు నవ్వులు పంచనుండటం విశేషం. విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మోహన్ బాబుగారి పుట్టినరోజు మార్చి 19న ‘ఆచారి అమెరికా యాత్ర’ పూజా కార్యక్రమాలు జరిపాం. ఇది హిలేరియస్ ఎంటర్‌టైనర్. సినిమా జోరుగా హుషారుగా ఉంటుంది. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి మంచి కథ అందించారు. ఈ నెల 5న హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇక్కడి షెడ్యూల్ పూర్తవగానే అమెరికా షెడ్యూల్ ప్రారంభమవుతుంది.
విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ హైలైట్‌గా నిలుస్తుంది‘ అన్నారు. తనికెళ్ల భరణి, కోటా శ్రీనివాసరావు, ఎల్బీ శ్రీరామ్, విద్యుల్లేఖా రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, పోసాని, పృధ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సిద్దార్థ, సమర్పణ: ఎం.ఎల్.కుమార్ చౌదరి.